ప్రస్తుతం ఐరోపాలో ఉక్రెయిన్ కేంద్రంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. నాటో కూటమి, రష్యాకు మధ్య పరిస్థితులు దారుణంగా దిగజారుతున్నాయి. ఇప్పటికే రష్యా సుమారు లక్ష ట్రూపులను మోహరించింది. కాగా, అమెరికా దేశం 8,500 ట్రూపులను సిద్ధంగా ఉంచింది. నాటో కూటమి ఇప్పటికే వార్‌షిప్‌లను, యుద్ధ సామగ్రిని ఉక్రెయిన్‌కు పంపింది. 

న్యూఢిల్లీ: ఇప్పుడు యూరప్(Europe) దేశాలన్నీ ఉక్రెయిన్‌(Ukraine)పైనే దృష్టి పెట్టాయి. ఆ దేశాల్లో కరోనా బీభత్సం సృష్టించి కాస్త వెనుకబాటు పట్టిన తరుణంలో ఇప్పుడు మరో ఉపద్రవం ముందుకు వచ్చింది. అది ఉక్రెయిన్ రూపంలో యూఎస్(US), ఐరోపా దేశాల్లో టెన్షన్ పుట్టిస్తున్నది. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులో పరిస్థితులు దారుణంగా దిగజారాయి. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో అనే భయాందోళనలు నెలకొన్నాయి. మళ్లీ కోల్డ్ వార్(Cold war) జరిగే ముప్పు ఉన్నదా? అనే చర్చ జరుగుతున్నది. సోషలిస్టు దేశం రష్యా(Russia)కు, క్యాపిటలిస్టు దేశం అమెరికాకు మధ్య కొన్నేళ్లపాటు ప్రచ్ఛన్నం యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంతో మరోసారి రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి.

ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించుకోవచ్చని నాటో దేశాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. రష్యాను ఎదిరించడానికి ఉక్రెయిన్‌కు సైనికపరమైన సహాయం చేస్తున్నాయి. మిలిటరీ ఎక్విప్‌మెంట్, ఆయుధాలు సహా ట్రూపులనూ పంపిస్తున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సుమారు 1 లక్ష ట్రూపులను మోహరించిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో దేశాలు వెల్లడించాయి. తమ దేశ భద్రత ప్రయోజనాలు ముఖ్యమని, కానీ, ఈ రీజియన్‌ సెక్యూరిటీని నాటో దేశాలు మంటగలుపుతున్నాయని రష్యా ఆరోపిస్తున్నది.

ఈ సంక్షోభం మూలాలు ఇక్కడే

రష్యా సామ్రాజ్యంలో కొన్ని శతాబ్దాలుగా ఉక్రెయిన్ దేశం భాగంగా ఉన్నది. ఆ తర్వాత అది సోవియెట్ యూనిన్ దేశాల్లోనూ భాగంగా ఉన్నది. కానీ, 1991లో యూఎస్ఎస్ఆర్ కూలిపోయిన తర్వాత ఉక్రెయిన్ దేశం రష్యా లెగసీ నుంచి బయటకు వెళ్లింది. స్వాతంత్ర్యం పొంది పశ్చిమ దేశాలకు దగ్గరవ్వ సాగింది. రష్యా నుంచి పశ్చిమం వైపు ఎంతగా దగ్గరయ్యిందంటే.. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందాలను వ్యతిరేకించిన రష్యా అనుకూల రాష్ట్రపతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. 2014లో ఆ రాష్ట్రపతి వైదొలగాల్సి వచ్చింది. కాగా, ఉక్రెయిన్ తూర్పు భాగం క్రిమియన్ పెనిన్సులానూ రష్యా తనకు అనుకూలంగా మలుచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వేర్పాటువాదులను ఎగదోసి ఉక్రెయిన్ దేశానికి వ్యతిరేకంగా ఘర్షణలకు పాల్పడుతున్నట్టు వాదనలు వచ్చాయి. రష్యానే ఆయుధాలు, ట్రూపులను పంపిస్తున్నదని ఆరోపణలు రాగా.. తమకు సంబంధం లేదని, అది వారి స్వచ్ఛంద నిర్ణయాలేనని రష్యా తొలుత కొట్టిపారేసింది. కానీ, అక్కడ రెఫరెండం నిర్వహించాక వారు రష్యాలో చేరుతామని ప్రకటించడంతో ఆ ప్రాంతం ఇక రష్యాలో భాగమని పుతిన్ ప్రకటించారు.

ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా యూఎస్, నాటో కూటమి బలగాలు ఉక్రెయిన్‌తో డ్రిల్స్ నిర్వహించడం వంటివాటిని రష్యా వ్యతిరేకించింది. తద్వార ఉక్రెయిన్.. రెబెల్స్ ఉన్న ప్రాంతాన్ని దురాక్రమించవచ్చని వాదించింది. అలాగే, ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరే అవకాశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నాటోలో చేరడానికి వీల్లేదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో నాటో సభ్య దేశాలు మిలిటరీ ట్రెయినింగ్ సెంటర్లు పెడితే.. అది వారికి ఒక మిలిటరీ శిబిరంగా మారుతుందని, అది తమ దేశ భద్రతకు ముప్పు అని పేర్కొంటున్నది.

రష్యాకు ఏం కావాలి?

రష్యాకు ఏం కావాలి అనేదాని కంటే కూడా ఏం వద్దు అనడం సబబు. ఉక్రెయిన్ దేశం పశ్చిమ దేశాలకు దగ్గరవ్వడం, నాటోలో చేరడం వంటివాటిని రష్యా వ్యతిరేకిస్తున్నది. రష్యా సరిహద్దులో నాటో డ్రిల్స్ రద్దు చేయాలనీ గతేడాది డిసెంబర్‌లో రష్యా పంపిన డిమాండ్ల జాబితాలో ఉన్నది. అలాగే, పశ్చిమ దేశాలు తమ దేశం వైపు మరింత వ్యాపించే ప్రయత్నం చేయవద్దనీ స్పష్టం చేసింది. ఇప్పటికైతే.. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కాదు. కానీ, భవిష్యత్‌లో చేర్చుకుంటామని నాటో తెలిపింది. నాటో ఇచ్చిన ఈ కమిట్‌మెంట్‌నూ రద్దు చేసుకోవాలని రష్యా తెలిపింది.

యుద్ధం జరుగుతుందా?

అమెరికా కూడా సుమారు 8,500 ట్రూపులను సిద్ధంగా ఉంచింది. నాటో ఇప్పటికే పలు ఆయుధాలను, వార్‌షిప్‌లను ఉక్రెయిన్‌కు తరలించింది. రష్యా సుమారు 1 లక్ష ట్రూపులను మోహరించింది. ఏ క్షణంలోనైనా రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేయవచ్చని అమెరికా వాదిస్తున్నది. కానీ, పశ్చిమ దేశాలు సైన్యాన్ని, యుద్ధ సామగ్రిని ఉక్రెయిన్‌కు పంపి పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయని రష్యా పేర్కొంటున్నది.

రష్యాతో ఇప్పటికే దిగజారిన సంబంధాల దృష్ట్యా అమెరికా, నాటో దేశాలు అక్కడ యుద్ధం చేయాలని భావించడం లేదని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఉక్రెయిన్‌ను తాము దురాక్రమిస్తామన్న వాదనలు కేవలం పశ్చిమ దేశాలవేనని, తమను అప్రతిష్టపాలు చేయాలనేదే వాటి కుట్ర అని రష్యా తెలిపింది. తాము ఉక్రెయిన్‌ను దురాక్రమించబోమని పేర్కొంది.

అయితే, కొందరు నిపుణులు మాత్రం రష్యా కొంత విధ్వంసం చేసి.. నాటోతో బేరసారాలు ఆడటానికి తన పట్టును పెంచుకునే ముప్పు ఉన్నదని చెబుతున్నారు.

ఒక వేళ రష్యా దేశం ఉక్రెయిన్‌పై దాడి చేస్తే.. యూఎస్, యూకే దేశాలు ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధించే అవకాశం ఉన్నది. అమెరికా దాని డాలర్‌ వినియోగంపై ఆంక్షలు విధించడమే కాక.. మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.