భారత్ దాయాది దేశం పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్- ప్రయాణికుల బస్సు ఢీ కొన్న ప్రమాదంలో 26 మంది   సజీవదహనమయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్లు అధికారులు తెలిపారు.  దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. 

ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బలూచిస్థాన్ లస్బెల్లా జిల్లాలో 40మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు, మితిమీరిన వేగంతో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగి ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటల్లో చిక్కుకుని బస్సులోని 26 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదంపై సమాచానం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొన్ని మృతదేహాలు మంటల్లో పూర్తిగా తదహనమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.