Asianet News TeluguAsianet News Telugu

ఉక్రెయిన్‌లో పర్యటించిన రిషి సునాక్.. 50 మిలియన్ పౌండ్ల రక్షణ సాయం ప్రకటన.. మద్దతుగా ఉంటామని భరోసా..

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ శనివారం ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సందర్శించిన రిషి సునాక్.. రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 

Rishi Sunak visits Kyiv offers New Air Defence Package To Ukraine
Author
First Published Nov 20, 2022, 9:38 AM IST

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ శనివారం ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సందర్శించిన రిషి సునాక్.. రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పౌరులను, కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు గగనతల రక్షణ వ్యవస్థలను అందజేస్తామని  భరోసా ఇచ్చారు.  ఉక్రెయిన్‌కు 50 మిలియన్ పౌండ్ల (60 మిలియన్ డాలర్ల) విలువైన కొత్త ఎయిర్ డిఫెన్స్ ప్యాకేజీని ప్రకటించారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. 

ఈ పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. రిషి సునాక్.. యుద్ధంలో చనిపోయిన వారి కోసం పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1930ల హోలోడోమర్ కరువు బాధితుల స్మారక చిహ్నం వద్ద కొవ్వొత్తి వెలిగించారు. తర్వాత అగ్నిమాపక కేంద్రంలో ఎమర్జెన్సీ వర్కర్స్‌ను కలిశారు. 

‘‘ఉక్రెయిన్‌కు అవసరమైన, అర్హత కలిగిన శాంతి మరియు భద్రతను గెలుచుకునే వరకు యూకే మీతో పాటు కొనసాగుతుందని చెప్పడానికి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఈ రోజు మీ దేశంలో మీతో ఉండటం చాలా వినయంగా ఉంది. ఉక్రెయిన్ ప్రజల ధైర్యం ప్రపంచానికి స్ఫూర్తి’’ అని రిషి సునాక్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో విలేకరుల సమావేశంలో అన్నారు. 

ఉక్రెయిన్ సాయుధ దళాలకు శిక్షణ ఆఫర్‌ను బ్రిటన్ పెంచుతుందని రిషి సునాక్ చెప్పారు. ప్రత్యేక సహాయాన్ని అందించడానికి నిపుణులైన ఆర్మీ మెడిక్స్, ఇంజనీర్లను ఈ ప్రాంతానికి పంపుతుందని ప్రకటించారు. ఇక, ఉక్రెయిన్‌కు ఇచ్చిన రక్షణ ప్యాకేజీలో 125 యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు, డజన్ల కొద్దీ రాడార్లు, యాంటీ-డ్రోన్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్ధ్యంతో సహా, ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్‌లను ఎదుర్కోవడానికి సాంకేతికతను బ్రిటన్ అందించనుంది. 

అంతేకాకుండా.. ప్రపంచ ఆహార కార్యక్రమం కోసం 12 మిలియన్ల పౌండ్ల సహాయ ప్యాకేజీని కూడా ప్రకటించాడు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్‌కు బ్రిటన్ 4 మిలియన్ పౌండ్ల సహాయాన్ని కూడా ఇస్తుందని ధ్రువీకరించారు. ఈ నిధులు జనరేటర్లు, మొబైల్ హెల్త్ క్లినిక్‌లను అందించడంలో సహాయపడతాయని బ్రిటన్ తెలిపింది. ఉక్రేనియన్ దళాల కోసం పదివేల తీవ్రమైన చలికాలపు కిట్‌లను బ్రిటన్ పంపుతోందని పేర్కొంది.

‘‘మొదటి నుండి యూకే ఉక్రెయిన్‌తో ఎలా నిలిచిందో చెప్పడానికి  నేను గర్విస్తున్నాను. ఈ క్రూరమైన యుద్ధాన్ని ముగించడానికి, న్యాయమైన శాంతిని అందించడానికి పోరాడుతున్నప్పుడు యూకే, మా మిత్రదేశాలు ఉక్రెయిన్‌తో పాటు నిలబడతాయని చెప్పడానికి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఉక్రెయిన్ సాయుధ బలగాలు రష్యా బలగాలను భూభాగం నుంచి వెనక్కి నెట్టడంలో విజయం సాధించినప్పటికీ..  పౌరులు గగనతలం నుంచి క్రూరంగా బాంబు దాడికి గురవుతున్నారు. మేము ఈ రోజు కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు, రాడార్, యాంటీ డ్రోన్ పరికరాలతో సహా కొత్త వైమానిక రక్షణను అందిస్తున్నాము. రాబోయే శీతాకాలంలో అవసరమయ్యే మానవతా మద్దతును పెంచుతున్నాం’’ అని రిషి సునాక్ చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో తాము ఉక్రెయిన్ కథను తమ మనవళ్లకు చెబుతామని రిషి సునాక్ కామెంట్ చేశారు. 

రిషి సునాక్ ఇచ్చిన భరోసాపై స్పందించిన జెలెన్‌స్కీ.. ‘‘మీలాంటి స్నేహితులు మా పక్కన ఉన్నందున.. మా విజయంపై మాకు నమ్మకం ఉంది’’ అని ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios