భారత్ చైనా సరిహద్దులో మొదలైన వివాదం ఇంకా పూర్తిస్థాయిలో సద్దుమణగలేదు. భారత్ తో చర్చలు జరుపుతూనే చైనా తన ద్వంద్వనీతిని బయటపెడుతోంది. భారత్ కవ్వింపు చర్యల వల్లే చైనా సైనికులు కూడా ఎదురు దాడికి దిగవలిసి వచ్చిందని భారత్ పై బురద చాల్లే ప్రయత్నం చేస్తుంది చైనా. 

ఇక చైనా దుందుడుకు చర్యలు ఆగ్నేయాసియా, దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో ఎక్కువవుతున్నందున ఆయా ప్రాంతాల్లో చైనా ను కట్టడి చేసేందుకు అమెరికా రంగంలోకి దిగింది. 

భారత్‌ సహా పలు ఆగ్నేయాసియా దేశాలైన ఫిలిప్పీన్స్, ఆసియా దేశాలకు చైనా సైనిక బలగాల నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాల  తరలింపును సమీక్షిస్తున్నామని, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు..

చైనా కు కౌంటర్ ఇవ్వడానికి తాము పూర్తి సంసిద్ధంగా ఉన్నామని, అందుకు అవసరమైన అన్ని వనరులను సమీకరిస్తున్నామని మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతానికి జర్మనీలో ఉన్న తమ సైనిక బలగాలను తగ్గించుకునే యోచనలో అమెరికా ఉంది. అక్కడ ఉన్న తమ బలగాలను దాదాపుగా 50 శాతానికి కుదించాలని అమెరికా ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. 

గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులకు అనుగుణంగా బలగాల మోహరింపుపై నిర్ణయం​ తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సులో చెప్పారు. స్ట్రాటజిక్ ప్రాంతాల్లో అమెరికన్‌ బలగాలున్నాయని, తాజాగా భారత్‌, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు చైనా నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో.... ఈ ఆలోచన చేస్తున్నట్టు ఆయన అన్నారు. 

ఏ ప్రాంతంలోనయినా, ఏ దేశానికైనా ముప్పు ఎదురైతే ఇతర దేశాలు బాధ్యతగా వారిని రక్షించాలని, ఈ అంశాలపై ఐరోపా దేశాలతో పాటు తమ భాగస్వాములందరితో సంప్రదింపులు జరుపుతామని పాంపియో పేర్కొన్నారు. 

కాగా భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. చర్చల్లో శాంతి మంత్రం జపిస్తున్న చైనా మరోవైపు సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో సైన్యాన్ని మోహరిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. 

భారత బలగాలు కూడా సరిహద్దుల వెంట అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. భారీ సైనిక మోహరింపును భారత ప్రభుత్వం కూడా చేపట్టింది. వాయుసేన కూడా రంగంలోకి దిగింది. చైనా సరిహద్దు దగ్గరగా ఉన్న ఎయిర్ బేసుల్లో యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచింది. భారతీయ ణౌకాదళం కూడా పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తూ సైద్ధంగా ఉంది.