శ్రీలంక సంక్షోభానికి ఆ కుటుంబమే కారణం అనే ఆరోపణలు విరివిగా వస్తున్నాయి. 1948లో శ్రీలంకకు స్వాతంత్ర్యం రావడానికి మునుపు నుంచే ఆ భూస్వామిక కుటుంబం అధిక ప్రాబల్యం కలిగినది. స్వాతంత్ర్య అనంతరం కూడా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. ఆ కుటుంబమే రాజపక్స కుటుంబం. ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా రాజపక్స కుటుంబం దేశ రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకుంది.

న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. విదేశీ మారక నిల్వలు కరిగిపోవడంతో ఇతర దేశాల నుంచి అవసరమైన సరుకులను, చమురును దిగుమతి చేసుకోలేని స్థితికి శ్రీలంక దిగజారింది. దీంతో విద్యుత్ సరఫరాలో కోతలు, ఇంధనం అందుబాటులో లేక.. అనేక అవస్థలు పడుతున్నారు. కనీస అవసరాలు కూడా తీరని స్థితికి చేరడంతో సాధారణ పౌరులు ఉవ్వెత్తున కదం తొక్కుతూ రోడ్డెక్కారు. ప్రభుత్వంపై ధిక్కారం ప్రకటించారు. చేసేదేమీ లేక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. క్యాబినెట్ మొత్తం రాజీనామా చేసింది. ప్రతిపక్షాలూ సహకరించాలని, ప్రభుత్వంలో కలిసిపోవాలనీ కోరింది.

శ్రీలంకలో సంక్షోభంతోపాటు అందుకు దోహదపడ్డ అంశాలపైనా చర్చ మొదలైంది. అదే విధంగా అక్కడి ప్రభుత్వ పాలన తీరును, ప్రభుత్వంలోని పెద్దల గురించీ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం రాజపక్స కుటుంబం చేతిలో ఉన్నది. ఆ కుటుంబంలోని వారే ప్రభుత్వంలో టాప్ పొజిషన్‌లలో ఉన్నారు. దీంతో శ్రీలంక సంక్షోభానికి ఆ కుటుంబమే కారణం అనే వాదనలు బలపడుతున్నాయి. శ్రీలంక సంక్షోభంతో సతమతం అవుతున్న ప్రజలూ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఆ కుటుంబంపై దుమ్మెత్తిపోస్తున్నారు. రాజపక్స కుటుంబం శ్రీలంక రాజకీయలను రెండు దశాబ్దాలుగా డామినేట్ చేస్తున్నది. అధ్యక్ష, ప్రధాన మంత్రి పొజిషన్‌లే కాదు.. కీలకమైన క్యాబినెట్ మంత్రులుగానూ రాజపక్స సోదరులు, వారి కుమారులు ఉన్నారు. వారి కుటుంబం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

రాజపక్స కుటుంబం గిరువపట్టువా గ్రామానికి చెందినది. శ్రీలంకలోని హాంబంటోటా జిల్లాలో ఈ గ్రామం ఉన్నది. రాజపక్స కుటుంబం ఆ గ్రామంలో భూస్వామిక కుటుంబం. శ్రీలంక 1948లో స్వాతంత్ర్యం పొందడానికి ముందు నుంచే డాన్ డేవిడ్ రాజపక్స అధిక ప్రాబల్యమున్న భూస్వామి. ప్రస్తుత అధ్యక్ష, ప్రధానిలు ఈయన మనవలే కావడం గమనార్హం. ఈ ఇద్దరి అంకుల్ డాన్ మాథ్యూ రాజపక్స అప్పటి సీలోన్‌లో హాంబంటోటాకు స్టేట్ కౌన్సిల్ సభ్యుడు. ఆ తర్వాత ఆ స్థానానికి వీరిద్దరి తండ్రి డాన్ ఆల్విన్ రాజపక్స ప్రాతినిధ్యం వహించారు.

ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స గతంలో రక్షణ మంత్రిత్వ శాఖకు 2005 నుంచి 2015 కాలంలో కార్యదర్శిగా చేశాడు. 2019లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. రక్షణ శాఖలో కార్యదర్శిగా ఉన్నప్పుడు వేలాది మంది తమిళులను ఊచకోత జరిగింది.

2020లో మహింద రాజపక్స రెండోసారి శ్రీలంకకు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. 2004లోనూ ఆయన పీఎంగా చేశాడ. 2005 నుంచి 2015 కాలంలో ఆయన అధ్యక్షుడిగానూ బాధ్యతలు చేపట్టాడు.

కాగా, బేసిల్ రాజపక్స ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. కానీ, ప్రస్తుత సంక్షోభంతో క్యాబినెట్ మంత్రులందరితోపాటు ఈయన కూడా రాజీనామా చేశాడు.

కాగా, చమల్ రాజపక్స ఇరిగేషన్ పోర్ట్‌ఫోలియో చూశాడు. డిఫెన్స్ మినిస్ట్రీలో గొటబాయ రాజపక్స తర్వాత ఆయన నెంబర్ టూగా కొనసాగాడు. పార్లమెంటులో స్పీకర్‌గానూ, షిప్పింగ్, ఏవియేషన్ మినిస్టర్‌గానూ చేశాడు.

మహింద రాజపక్స కొడుకు నమల్ రాజపక్స టాప్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. 2010లో తొలిసారి ఎంపీగా గెలిచాడు. మొన్నటి వరకు స్పోర్ట్స్, యూత్ మినిస్టర్‌గా ఉన్నాడు. చమల్ కొడుకు శషీంద్ర కూడా వ్యవసాయ సంబంధ పరిశ్రమల శాఖకు మినిస్టర్‌గా ఉన్నాడు.