Asianet News TeluguAsianet News Telugu

క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూత.. తదుపరి బ్రిటన్ రాజు మూడో చార్లెస్!

క్వీన్ ఎలిజబెత్ 2 తన 96వ యేట తనువు చాలించారు. స్కాట్లాండ్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. రాజ వంశస్తులు ముందుగానే స్కాట్లాండ్ చేరుకున్నారు. దీర్ఘకాలం, 70 ఏళ్లపాటు బ్రిటన్ రాణిగా బాధ్యతలు చేపట్టి ఆమె రికార్డు నెలకొల్పారు.
 

queen elizabeth II dies at 96 in scottland
Author
First Published Sep 8, 2022, 11:48 PM IST

న్యూఢిల్లీ: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె తన 96వ యేటా తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌ను దీర్ఘకాలం పాలించిన రాణిగా తన పేరును రికార్డుల్లో సుస్థిరం చేసుకున్నారు. 70 ఏళ్లపాటు ఆమె బ్రిటన్‌కు రాణిగా కొనసాగారు.

క్వీన్ ఎలిజబెత్ 2 తన చివరి రోజుల్లో స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ రిట్రీట్‌లో గడిపారు. ఆమె అనారోగ్యం దారుణంగా దిగజారడంతో రాజ వంశస్తులు ముందుగానే అక్కడకు చేరుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 తనయుడు, ఆమె వారసుడు ప్రిన్స్ చార్లెస్, మనవళ్లు విలియం, హ్యారీలు, ఇతర కుటుంబ సభ్యులు స్కాట్లాండ్ చేరుకున్నారు.

ఈ ఏడాది జూన్‌లోనే బ్రిటన్ పగ్గాలు చేపట్టి 70 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్లాటినమ్ జూబిలీ సెలబ్రేషన్స్ చేశారు. రాయల్ పరేడ్లు, స్ట్రీట్ పార్టీలు, ఇతర విధాల్లో సంబురాలు చేశారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె ఈ సందర్భంగా ఇంగ్లాండ్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ రాశారు.

క్వీన్ ఎలిజబెత్ 2 అనారోగ్యం కారణంగా చాలా కార్యక్రమాలకు ఆమె హాజరు కాలేకపోయారు. ఆమెకు బదులుగా ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియమ్‌లు హాజరయ్యేవారు. జూబిలీ వేడుకల్లో చివరగా ఆమె బకింగ్ హామ్ ప్యాలెస్‌లో బాల్కనీలో నిలబడి కనిపించారు. స్టాంప్‌లు, బ్యాంక్ నోట్లు, కాయిన్ల పైనా, సంస్కృతిలోనూ చిరంజీవులుగా మిగిలిన ఏకైక రాణి ఈమెనే కావడం గమనార్హం.

క్వీన్ ఎలిజబెత్ భర్త 73 ఏళ్ల తమ దాంపత్య జీవితం తర్వాత కన్నుమూశాడు. గతేడాది ఏప్రిల్‌లో ప్రిన్స్ ఫిలిప్ మరణించాడు. 100వ జన్మదినానికి ఆయన మరికొన్ని వారాల ముందే కన్నుమూశారు. కరోనా ప్రోటోకాల్ కారణంగా భర్త అంత్యక్రియల కోసం క్వీన్ ఎలిజబెత్ 2 సెయింట్ జార్జ్ చాపెల్‌లో ఒంటరిగా కూర్చుని ఉన్న చిత్రం ప్రపంచాన్ని కదిలించింది.

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 మరణించినట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. బల్మోరల్ ఎస్టేట్‌లో ఆమె గురువారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు వివరించింది. 

ఎలిజబెత్ 2 ఆరోగ్యం మరీ క్షీణిచడంతో వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండగా రాజవంశీకులు గురువారం ఆమె తన చివరి రోజులు గడిపిన స్కాట్లాండ్‌కు బయల్దేరి వెళ్లారు. ఆమె మనవడు ప్రిన్స్ విలియమ్, విలియమ్ సోదరుడు హ్యారీలు కూడా అక్కడికి చేరుకున్నారు.

అనారోగ్యం కారణంగా క్వీన్ ఎలిజబెత్ 2 తొలిసారిగా స్కాట్లాండ్‌లో ప్రధానిని నియమించారు. లిజ్ ట్రస్‌ను ఆమె పీఎంగా అపాయింట్ చేశారు. యూకే నూతన ప్రధాని లిజ్ ట్రస్ కూడా క్వీన్ ఎలిజబెత్ 2 మరణంపై స్పందించారు. 

తదుపరి బ్రిటన్ రాజుగా మూడో చార్లెస్ బాధ్యతలు తీసుకుంటారు. కొత్త బ్రిటన్ కింగ్‌కు తాము అన్ని విధాల మద్దతు ఇస్తామని లిజ్ ట్రస్ ప్రకటించారు. కొత్త రాజుగా బాధ్యతలు తీసుకునే చార్లెస్ 3, ఆయన భార్య ఈ రోజు స్కాట్లాండ్‌లోనే ఉండనున్నారు. రేపు లండన్ తిరిగి వెళ్లనున్నారు. తన తల్లి మరణంతో తాను, తన కుటుంబం తీవ్రంగా కలత చెందానని న్యూ కింగ్ చార్లెస్ 3  తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios