రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం చికిత్స తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయనకు సర్జరీ కూడా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో ఆయన తనకు అత్యంత సన్నిహితుడైన పత్రుషేవ్ కు అధికారం అప్పగించే అవకాశం ఉందని మీడియా నివేదించింది. 

మాస్కో: Russia అధ్యక్షుడు Vladimir Putinక్యాన్సర్ ట్రీట్ మెంట్ లో భాగంగా Surgery చేసుకొనే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. క్యాన్సర్ సర్జరీ చేసుకొనేందుకు గాను పుతిన్ వెళ్లే సమయంలో రష్యా దేశ భద్రతా మండలి కార్యదర్శి Nikolai Patrushevకు తాత్కాలికంగా అధికారాన్ని అప్పగిస్తున్నారని అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని న్యూయార్క్ పోస్టు నివేదించిందని ఎఎన్ఐ పేర్కొంది.

పుతిన్ ఇటీవల కాలంలో అనారోగ్యంగా కనిపిస్తున్నారని ప్రచారం సాగుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ Cancer తో పాటు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు క్యాన్సర్ కు సంబంధించి సర్జరీ చేసుకొనే అవకాశం ఉందనే విషయమై తమకు కచ్చితమైన సమాచారం లేదని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. మీడియా నివేదికలను ధృవీకరించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు.

కొన్ని రోజుల క్రితం పుతిన్ తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నికోలాయ్ పత్రుషేవ్ తో రెండు గంటలపాటు మాట్లాడినట్టుగా మీడియా నివేదించింది. పుతిన్ కు పత్రుషేన్ అత్యంత విశ్వసనీయమైన మిత్రుడిగా పేరుంది. పుతిన్ కంటే పత్రుషేవ్ గొప్పవాడు కాదని టెలిగ్రామ్ చానెల్ యజమాని చెబుతున్నారు. పుతిన్ కంటే పత్రుషేవ్ మోసపూరితమైనవాడని ఆయన అభిప్రాయపడ్డారు.

పుతిన్ ఎక్కువ కాలం పాటు పత్రుషేవ్ కు అధికారం అప్పగించే అవకాశం లేదని మీడియా పేర్కొంది. రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా పత్రుషేవ్ నియంత్రణలో రష్యా ఉండే అవకాశం లేదని కూడా న్యూయార్క్ పోస్టు తెలిపింది.

రష్యా భద్రతా మండలికి పత్రుసేవ్ కార్యదర్శిగా ఉన్నారు. రష్యాలోని సైనిక, భద్రతా సమస్యలపై మార్గదర్శకాలను ఈ సంస్థ జారీ చేస్తుంది. పత్రుషేవ్ కూడా పుతిన్ మాదరిగానే రష్యన్ ఇంటలిజెన్స్ ఏజంట్ గా గతంలో పనిచేశాడు. తొలుత కేజీబీ, ఆ తర్వాత ఎఫ్ ఎస్ బీ లో పత్రుషేవ్ పనిచేశారు. 

గత వారంలో రష్యన్ పేపర్ రోసిస్కాయ్ గెజిటాకు పత్రుషేవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికా, యూరప్ లు ఉక్రెయిన్ లో నాజీ భావజాలానికి మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. కీవ్ లోని తన అనుచరులను ఉపయోగించుకొని రష్యాను అణచివేసేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని కూడా ఆ ఇంటర్వ్యూలో పత్రుషేవ్ విమర్శలు చేశారు.

ఇటీవల కాలంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై సందేహాలు వస్తున్నాయి. గత నెలలో రక్షణ మంత్రి సెర్గీ సోయిగ్ తో జరిగిన సమావేశంలో పుతిన్ డెస్క్ ను గట్టిగా పట్టుకొన్నట్టుగా కన్పించింది.