ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రపంచ దేశాలను కలవరంలోకి నెట్టేస్తే.. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రకటన ఆందోళనలను రెట్టింపు చేస్తున్నాయి. పశ్చిమ దేశాలు తమతో శత్రుపూరితంగా వ్యవహరిస్తున్నాయని, అందుకే తాము న్యూక్లియర్ డెటరెంట్ ఫోర్సెస్‌ను హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించినట్టు పుతిన్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) సైనిక చర్య(Military Operation) ప్రకటించగానే ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఈ సైనిక చర్య ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందో అని అన్ని దేశాలు ఆందోళన పడ్డాయి. ఇప్పుడు ఆ ఆందోళనలు రెట్టింపు అవుతున్నాయి. న్యూక్లియర్(Nuclear) డిటరెంట్ ఫోర్సెస్‌ను తాను హై అలర్ట్ చేశారని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించడమే ఇందుకు కారణం. పశ్చిమ దేశాలు రష్యాతో అననుకూల వైఖరిని అవలంభిస్తున్నాయని, వారి వల్లే తాము అణ్వాయుధాలనూ సిద్ధంగా పెట్టుకుంటున్నట్టు తెలిపారు.
ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశాల జాబితాలో రష్యా రెండో స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో భారీగా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. రష్యా ఆర్మీ వెన్నెముకగా ఇవే ఉన్నాయి.
ఉన్నత అధికారులతో కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ఓ సమావేశంలో మాట్లాడారు. నాటో కూటమిలోని దేశాలు తమ దేశంపై దూకుడుగా, దుందుడుకుగా వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడమే కాక.. నోరు కూడా అదుపులో పెట్టుకోవడం లేదని అన్నారు. రష్యా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌పైనా ఆంక్షలు విధిస్తున్నట్టు నాటో దేశాలు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలోనే తాను తమ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌కూ న్యూక్లియర్ డిటరెంట్ ఫోర్సెస్‌ను హై అలర్ట్‌గా ఉంచాలని ఆదేశించినట్టు పుతిన్ వివరించారు. స్పెషల్ రెజైమ్ ఆఫ్ కంబాట్ డ్యూటీ మోడ్‌లో ఉండాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు తమ దేశంపట్ల ఎలా వ్యవహరిస్తున్నామో అందరూ చూడవచ్చునని ఆయన తెలిపారు. ఆర్థికంగా చట్ట విరుద్ధ ఆంక్షలు విధించడమే కాదు.. తమను శత్రువుగా చూస్తున్నాయని పేర్కొన్నారు. తమ దేశంపట్ల దూకుడుగా వ్యాఖ్యలు చేయడాన్ని నాటోకు సారథ్యం వహిస్తున్న నేతలు ఆమోదిస్తున్నారని వివరించారు.
ఆయన ఆదేశాలతో ప్రపంచదేశాల్లో ఆందోళనలు రెట్టింపు అయ్యాయి. ఉక్రెయిన్ సంక్షోభంతో పశ్చిమ దేశాలు, అమెరికాలతో రష్యాకు అణ్వాయుధ యుద్ధం జరుగుతుందా? అనే ఆందోళనలు వస్తున్నాయి. యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగించే స్థితికి వెళ్తే.. మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ముప్పు ఉన్నది.
ఇదిలా ఉండగా రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించింది. బెలారస్‌లో చర్చలకు అంగీకరించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఈ నేపథ్యంలో చర్చల కోసం బెలారస్ బయల్దేరింది ఉక్రెయిన్ బృందం. అంతకుముందు రష్యాతో చర్చలు జరపడానికి తమ దేశం సిద్దంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) చెప్పారు. అయితే పొరుగున ఉన్న బెలారస్ మాత్రం చర్చలు జరపబోమని తెలిపారు. బెలారస్‌ను దండయాత్రకు వేదికగా జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు జెలెన్ స్కీ పలు ప్రాంతాలను సూచించారు. వార్సా, బ్రాటిస్లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బాకులను చర్చలకు వేదికగా ప్రతిపాదించినట్టుగా చెప్పారు.
‘మేము మాట్లాడాలనుకుంటున్నాము.. మేము యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం’ అని జెలెన్ స్కీ ఒక వీడియోలో చెప్పారు. అయితే క్షిపణులను ఉంచిన దేశంలో మాత్రం చర్చలు జరపలేమని తెలిపారు. ఇక, శాంతి చర్చల కోసం తమ నాయకులు బెలారస్ చేరుకున్నారని క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) నుంచి ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. తాము కూడా శాంతి చర్చలకు సిద్దమని Zelensky చెప్పారు.
