ఈ కాలం యువత ప్రేమలో ఎంత సులభంగా పడిపోతున్నారో... అంతే సులభంగా విడిపోతున్నారు. ఇద్దరి అంగీకారంతో విడిపోతే ఒకే... అలా కాకుండా.. కొందరు ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉన్నవారు కూడా ఉన్నారు. ఎవరైనా అమ్మాయి తమను మోసం చేసింది అంటే చాలు ఇక అబ్బాయిలు.. జీవితంలో తాము అన్నీ కోల్పోయామన్నట్లుగా తయారై.. సదరు యువతి జీవితాన్ని కూడా పూర్తి నాశనం చేసేంత వరకు వదలి పెట్టరు. 

అదే అమ్మాయి.. తాను ఎంతగానో ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోతే..? చాలా వరకు ఏడుస్తూ తమ బాధను తీర్చుకుంటారు. అయితే... ఓ అమ్మాయి మాత్రం తనను మోసం చేసిన ప్రియుడిపై తెలివిగా రివేంజ్ తీర్చుకుంది. అది కూడా చాలా వెరైటీగా.. ఇలాంటి రివేంజ్ ఇప్పటి వరకు ఎవరూ తీర్చుకొని ఉండరేమో. ప్రియుడిని జైలుకి పంపడంతోపాటు.. అతను బతికుండగానే చనిపోయాడంటూ అంత్యక్రియలు కూడా నిర్వహించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

థేయా లోవరిడ్జ్ అనే మహిళ, ఓ వ్యక్తిని మూడేళ్లుగా ప్రేమిస్తుంది. వివాహం కానప్పటికి ఇద్దరు కలిసే ఉంటున్నారు. మొదట బాగానే ఉన్న థేయా బాయ్‌ఫ్రెండ్‌ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు మరో మహిళను ప్రేమించాడు. దీని గురించి థేయాకు తెలియకుండా.. కొత్త ప్రియురాలితో కలిసి ఏంజాయ్‌ చేయసాగాడు. 

అయితే తన బాయ్‌ఫ్రెండ్‌ తనను మోసం చేసి.. వేరే యువతితో తిరుగుతున్నాడని.. థేయాకు తెలిసింది. ఈ మోసాన్ని తట్టుకోలేకపోయింది. తనని మోసం చేసినందుకు ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఓ మంచి ప్లాన్‌ సిద్ధం చేసుకుంది. తన ప్రియుడి చెల్లెలని కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి సాయం చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆ యువతి కూడా అంగీకరించింది. ఈ క్రమంలో థేయా మొదట తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని జైలుకు పంపింది.

ఇక ఈ విషయాలు ఏవి తెలియని థేయా మాజీ ప్రియుడి కొత్త లవర్‌, అతడి మొబైల్‌కు అనేక సార్లు కాల్‌ చేసింది.. మెసేజ్‌లు పంపంది. కానీ ఎలాంటి రిప్లై రాలేదు. కొద్ది రోజుల పాటు ఆమెను ఇలా కంగారు పెట్టిన థేయా ఓ రోజు బాంబ్‌ పేల్చింది. ‘‘మీ బాయ్‌ఫ్రెండ్‌ చనిపోయాడు. ఈ రోజు అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం’’ అని మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి మెసేజ్‌ చేసింది. 

ఆమెను నమ్మించడం కోసం ఉత్తుత్తి అంత్యక్రియలు నిర్వహించింది థేయా. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది. తన మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి అతడు జైలులో ఉన్నట్లు ఇప్పటికి తెలియదు. ఆమె ఇంకా అతడు చనిపోయాడనే భావిస్తుంది. ప్రతి ఏటా అతడి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తుందని తెలిపింది థేయా. తనను మోసి చేసినందుకు అతడికి ఇలా జరగాల్సిందే అంటుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భలే బుద్ధి చెప్పావంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించడం కొసమెరుపు.