అమెరికాలో పోలీసుల చేతిలో జార్జ్ ప్లాయిడ్ అనే నల్ల జాతీయుడి మరణం అమెరికా అంతా కూడా హింసాత్మక ఘ్టనలకు దారితీస్తూనే ఉంది. మే 25న మొదలైన నిరసనలు రోజురోజుకి అమెరికా అంతా వ్యాపిస్తున్నాయి. 

తాజాగా ఆ నిరసనల సెగ వైట్ హౌస్ ని కూడా తాకింది. వైట్ హౌస్ సమీపంలోని ఒక పార్క్ వడ్ఢఫా నిరసనకారులు ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న తరుణంలో పోలీసులకు, నిరసనకారులు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు నిరసనకారులపై రబ్బర్ బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ లను ప్రయోగించి చెదరగొట్టారు. 

ఇక వైట్ హౌస్ బయట ఇలా నిరసన కారులు ఒక్కసారిగా ఆందోళనలకు దిగడం, భద్రత బలగాలు, వారికి మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని కొద్దిసేపు వైట్ హౌజ్ కింద ఉన్న బంకర్ లోకి తీసుకెళ్లారు. 

అత్యవసర సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం ఆ బంకర్ లోకి అమెరికా అధ్యక్షుడిని తరలిస్తారు. నిన్నటి అల్లర్ల నేపథ్యంలో అరగంట, గంట మధ్య పాటు అధ్యక్షుడు ట్రంప్ ని బంకర్ లోకి వైట్ హౌస్ సెక్యూరిటీ సిబ్బంది తరలించారు. 

గత ఆరు రాత్రులుగా రాత్రిపూట ఆందోళనలకు దిగుతున్నవారిని ట్రంప్ దేశీయ తీవ్రవాదులు అనడంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోతున్నారు. ఎక్కడో మిన్నియాపులిస్ లో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. అమెరికాలోని ప్రధాన నగరాల్లో రాత్రిళ్ళు కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఈ నిరసనలకు కారణం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో మరణించడం. పోలీసులు అతడిపట్ల కనీసం కనికరం కూడా లేకుండా అతడిని కింద పడేసి అతడి మీద మీద బలంగా మోకాలితో ఒత్తడం వల్ల అతడు మరణించాడు. 

నల్లజాతీయుడు కాబట్టే పోలీసు అలా ప్రవర్తించాడని, బ్లాక్ లైవ్స్ మేటర్ అంటూ అమెరికా అంతా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అతడి మరణానికి కారకులైన పోలీసు అధికారులను విధుల నుండి తొలిగించి అరెస్ట్ చేసారు.