శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. దీంతో లంక ప్రజలు అంతర్జాతీయ సాయం కోరుతున్నారు. మరోవైపు ప్రధాని మహీందా రాజపక్షే రాజీనామా చేయాలంటూ ప్రజలు ఆయన ఇంటిని ముట్టడించారు. 

శ్రీలంక రాజధాని కొలంబోలో (colombo) ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మహీందా రాజపక్షే (mahinda rajapaksa) ఇంటిని ముట్టడించారు శ్రీలంక వాసులు. రాజపక్షే కుటుంబం తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బారీకేడ్లను తోసుకుని లోపలికి దూసుకెళ్లారు ఆందోళనకారులు. పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆర్మీని రంగంలోకి దింపారు. నిరసన కారులను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సెక్యూరిటీ లెవల్ టూ దాటితే టియర్ గ్యాస్ ప్రయోగానికి, మూడో లెవల్ సెక్యూరిటీ దాటితే ఆందోళనకారులపై కాల్పులు జరిపే ఛాన్స్ వుందని సమాచారం. మరోవైపు నిరసనకారులు మోహరించిన చోట విద్యుత్‌ను నిలిపివేశారు పోలీసులు. 

కాగా... శ్రీలంక‌లో ఆర్థిక సంక్షోభం (sri lanka economic crisis) ముదురుతోంది. ఇప్ప‌టికే ఆ దేశం వ‌ద్ద విదేశీ మార‌క నిల్వ‌లు దాదాపుగా అయిపోయాయి, దీని కారణంగా అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోలేకపోతోంది. దేశంలో ఆహార ధాన్యాలు, చక్కెర, పాలపొడి, కూరగాయలు, మందుల కొరత తీవ్రంగా ఉంది. ఆహార‌ పదార్థాలు, ఇంధనం (పెట్రోల్‌, డీజిల్‌) కోసం గొడవలు జరిగేలా పరిస్థితి దాపురించింది. దీంతో పెట్రోల్ పంపుల వద్ద సైన్యాన్ని మోహరించారు. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో శ్రీలంక‌లో సామాన్య ప్ర‌జానీకం ప‌రిస్థితి దారుణంగా మారింది. 

ఆక‌లి మంట‌ల్లోకి జారుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో జ‌నాలు ప‌స్తులు ఉండాల్సిన ప‌రిస్థితుల్లో జీవిస్తున్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశాన్ని సంక్షోభం ముంచెత్త‌డంతో ప్ర‌పంచ దేశాల‌ స‌హాయం కోసం ఎదురుచూస్తోంది శ్రీలంక స‌మాజం. ఈ నేప‌థ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ అధికారులకు సహాయం చేయడానికి శ్రీలంక ముగ్గురు సభ్యుల సలహా బృందాన్ని నియమించింది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి అన్ని మార్గాల దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని శ్రీలంక ఆధ్య‌క్షుడు చెప్పారు. 

దేశంలో 13 గంటలపాటు కరెంటు కోతలు విధిస్తోంది స‌ర్కారు. బస్సులు నడిపేందుకు డీజిల్‌ లేకపోవడంతో ప్రజా రవాణా స్తంభించింది. గత 24 గంటల్లో శ్రీలంకకు భారత్ రెండు షిప్పుల్లో భారీగా ఇంధన సరుకులను డెలివరీ చేసిందనీ, సంక్షోభంలో ఉన్న ద్వీప దేశానికి సాయం చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని భారత హైకమిషన్ వెల్ల‌డించింది. భారతదేశం 36,000 టన్నుల పెట్రోలు మరియు 40,000 టన్నుల డీజిల్‌ను సరఫరా చేసింది. శ్రీలంకకు మొత్తం భారతీయ ఇంధన సరఫరాలను 270,000 టన్నులకు తీసుకువెళ్లిందని హైకమీషన్ తెలిపింది. శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత మంగళవారం అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తొలిసారిగా పార్లమెంట్ సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే, ఈ సమావేశానికి ప్రతిపక్షాలే కాదు, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు కూడా హాజరుకాలేదు. ఇప్ప‌టికే అక్క‌డి ప్ర‌భుత్వం మైనార్టీలోకి జారుకుంది. సంకీర్ణ ప్ర‌భుత్వం నుంచి అనేక మిత్ర ప‌క్షాలు వైదొల‌గాయి.