ఒకటి ఆరా నగలు కొట్టేస్తేనే మన దగ్గర కథకథలుగా చెప్పుకుంటారు. అలాంటిది ఏకంగా రూ. 7,800 కోట్ల విలువైన నగలును దోచేసిన దొంగలు ఒక ఆడీ కారులో పరారయ్యారు. వివరాల్లోకి వెళితే.. జర్మనీలోని అత్యంత ప్రముఖ డ్రెస్డన్ మ్యూజియంలో కొన్ని వందల ఏళ్ల నాటి నగలు, వజ్రాలు ఇతర ఆభరణాలను భద్రపరిచారు.

వీటిపై కన్నేసిన దొంగలు పక్కా ప్రణాళికతో దోపిడికి ప్లాన్ చేశారు. మ్యూజియంలోని గ్రీన్ వాలెట్ భవనానికి అత్యంత కట్టుదిట్టమైన ఎలక్ట్రానిక్ భద్రతా వ్యవస్థ ఉంటుంది. దీనికి విద్యుత్తు సమీపంలోని అగస్టీస్ వంతెన కింద నుంచి సరఫరా అవుతుంది.

Also Read:మహా రాజకీయం: బలపరీక్షా, రాజీనామానా.... మోడీ-షా వ్యూహమేంటీ

ఈ సంగతిని పసిగట్టిన దుండగులు... విద్యుత్ సరఫరా వ్యవస్థకు నిప్పు పెట్టారు. మ్యూజియం ఉన్న ప్రాంతానికి విద్యుత్ వ్యవస్థ నిలిచిపోగానే ఒక కిటికీని బద్దలు కొట్టి భవనంలోకి ప్రవేశించారు. దొంగతనం విషయంలోనూ తెలివిగా వ్యవహరించిన దొంగలు.. పెద్ద నగల జోలికి వెళ్లకుండా, చిన్న చితకా నగలను తీసుకుని ఆడీ కారులో పరారయ్యారు.

అలారం మోగడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో దుండగులు ప్రయాణించే మార్గాన్ని మూసివేశారు. అయితే అప్పటికే దొంగలు జారుకున్నారు.

17వ శతాబ్ధంలో జర్మనీని పరిపాలించిన సాక్సోని రాజ కుటుంబానికి చెందిన అగస్టస్ స్ట్రాంగ్ ఈ గ్రీన్ వాలెట్ భవనాన్ని నిర్మించారు. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాకు చెందిన రెడ్ ఆర్మీ ఈ మ్యూజియాన్ని దోచుకుని ధ్వంసం చేసింది. అయితే 1958లో ఆ సంపదను రష్యా ప్రభుత్వం తిరిగి ఇచ్చేసింది.

దీనికి 2000 సంవత్సరంలో మరమ్మత్తులు చేసి.. 2006లో ది గ్రీన్ వాలెట్ భవనాన్ని మళ్లీ తెరిచి అత్యంత విలువైన చారిత్రక సంపదను భద్రపరిచారు. ఈ మ్యూజియంలో గతంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన 41 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రం కూడా ఉండేది.

Also Read:ఫడ్నవీస్‌కు షాక్: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా

అయితే ఇది ప్రస్తుతం న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియంలో ఉండటం వల్ల దొంగలబారిన పడలేదు. కాగా మ్యూజియానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు లోపల సంచరిస్తున్నట్లు గుర్తించారు. అలాగే అక్కడికి దగ్గర్లోని ఓ గ్యారేజ్‌లో తగలబడుతున్న ఆడీ ఎ6 కారును కూడా గుర్తించారు. దీనిని దొంగలు ఉపయోగించిన కారుగా భావిస్తున్నారు.