ఏపీలోని కర్నూలుకు చెందిన కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరిలో అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. అయితే దీనిపై భారత్ సీరియస్ అయ్యింది.
అమెరికాలో భారత సంతతికి చెందిన కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన పోలీసులు ఆఫీసర్ ప్రవర్తించిన తీరు, వ్యాఖ్యల పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన బాడీ కెమెరాలో జాహ్నవి గురించి హేళనగా మాట్లాడిన తీరు రికార్డు అయ్యింది. అవి బయటకు వచ్చి, భారత్ లో వైరల్ గా మారాయి. అతడిపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో భారత్ సీరియస్ అయ్యింది.
శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ ఆఫీస్ ఈ ఘటనపై స్పందించింది. దౌత్యాధికారి తరణ్‌జీత్ సింగ్ సంధూ ఈ ఘటనను వాషింగ్టన్ డీసీలో ఉన్న అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సియాటెల్, వాషింగ్టన్ రాష్ట్ర అధికార యంత్రాంగానికి వివరించారు. ప్రమాదాన్ని దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి అధికారులు స్పందించారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన కందుల జాహ్నవి ఉన్నత విద్యనభ్యసించేందుకు యూఎస్ఏ వెళ్లారు. నార్తీస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని సీటెల్ క్యాంపస్‌లో ఆమె మాస్టర్స్ చదువుతోంది. అయితే ఆమె సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలో జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతుండగా.. ఈ ఏడాది జనవరి 23వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమెను ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడే చనిపోయారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన ఆఫీసర్ డేనియల్ ఆడెరర్ గిల్డ్ ప్రెసిడెంట్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన నవ్వుతూ, మృతురాలి గురించి మేళనగా మాట్లాడారు. ఆమె ఒక సాధారణ వ్యక్తి అని, ఆమె చనిపోయిందని చెప్పారు. ఆమెకు 26 సంవత్సరాలే, ఆమె జీవితానికి అంత విలువలేదని చెప్పారు. 11వేల డాలర్లు చెక్కు రాస్తే సరిపోతుందని అన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తప్పు ఏమీ లేదని చెప్పాడు. అయితే ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డయ్యింది. తాజాగా బయటకు విడుదలైంది.
కాగా.. డానియల్ మాటలు విన్న ఇక్కడి జాహ్నవి కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. తాము ఇప్పటికే తమ బిడ్డను కోల్పోయామని, కానీ అతడి మాటలను మమల్ని ఇంకా కుంగిపోయేలా చేస్తున్నాయని మృతురాలి తాత ‘ఆంధ్రజ్యోతి’తో ఆవేదన వ్యక్తం చేశారు. తన మనువరాలి ప్రాణానికి విలువ లేదా అని అన్నారు. జాహ్నవి జనవరిలో చనిపోయిందని, కానీ ఆ ప్రమాదానికి సంబంధించిన నివేదికను ఇప్పుడు బయట పెట్టడమేమిటని అన్నారు. ఈ మాటలు విన్న తన కూతురు షాక్ కు గురయ్యిందని, రెండు రోజుల నుంచి అన్నం కూడా తినడం లేదని ఆయన రోదించారు.
