దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధేనన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఐక్యరాజ్యసమతిలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. తాను 130 కోట్ల మంది భారతీయుల తరపున మాట్లాడుతున్నానని...తనను, తన ప్రభుత్వాన్ని భారతీయులు రెండోసారి ఎన్నుకున్నారని ప్రధాని గుర్తుచేశారు.

జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గం నేటికీ అనుసరణీయమని.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను భారత్‌లో నిషేధించాలని ప్రధాని స్పష్టం చేశారు. 2022 నాటికి పేదలకు మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని.. 2025 నాటికి భారత్‌ను టీబీరహిత దేశంగా మారుస్తామని మోడీ ప్రకటించారు.

నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయతని, 130 కోట్ల మంది భారతీయులను దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రయత్నాలు మొత్తం ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడాలని.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శమని ప్రధాని తెలిపారు.

గ్లోబల్ వార్మింగ్‌కు భారత్ పెద్ద కారణం కాదని అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోందని మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని, ఐక్యరాజ్యసమితి మరింత శక్తివంతం కావాలని ప్రధాని ఆకాంక్షించారు.