యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం డెన్మార్క్ చేరుకున్నారు. జర్మనీ నుంచి కోపెన్‌హాగన్ చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్‌సెన్ స్వాగతం పలికారు.
యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం డెన్మార్క్ చేరుకున్నారు. జర్మనీ నుంచి కోపెన్‌హాగన్ చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్‌సెన్ స్వాగతం పలికారు. అనంతరరం ప్రధాని మోదీ.. డెన్మార్క్ ప్రధాని అధికారిక నివాసమైన మారియన్‌బోర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ డెన్మార్ ప్రదాని తన నివాసం మొత్తం మోదీ చూపించారు. తన చివరి భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన పెయింటింగ్‌ను కూడా చూపించారు.
ఇక, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంచడంపై భారత, డెన్మార్క్ ప్రధానులు చర్చించారు. ఫ్రెడరిక్‌సెన్ నివాసంలో ఉన్న పచ్చిక లాన్‌లో ఇద్దరూ తిరుగుతూ వివిధ అంశాలపై ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక, డెన్మార్‌లో ప్రధాని మోదీకి లభించిన స్వాగతాన్ని.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి Special Gestureగా అభివర్ణించారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ డెన్మార్క్‌లో పర్యటించడం ఇది తొలిసారి.
ఈ సందర్భంగా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మన రెండు దేశాలు ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ, చట్ట నియమాల విలువలను పంచుకుంటాయి. ఈ రోజు మేము భారతదేశం-EU సంబంధాలు, ఇండో-పసిఫిక్, ఉక్రెయిన్‌తో సహా అనేక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను కూడా చర్చించాము. భారతదేశం-EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు వీలైనంత త్వరగా ముగుస్తాయని మేము ఆశిస్తున్నాము. మేము ఉక్రెయిన్‌లో తక్షణ కాల్పుల విరమణ, సమస్యను పరిష్కరించడానికి చర్చలు, దౌత్యం కోసం విజ్ఞప్తి చేసాము
భారతదేశ మౌలిక సదుపాయాల రంగం, హరిత పరిశ్రమలలో డానిష్ కంపెనీలు, డానిష్ పెన్షన్ ఫండ్‌లకు అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో పవన శక్తి, షిప్పింగ్, కన్సల్టెన్సీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్ మొదలైన వివిధ రంగాలలో 200 కంటే ఎక్కువ డానిష్ కంపెనీలు పనిచేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
ఇక, ‘‘డెన్మార్క్‌తో మన విశిష్టమైన 'గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్'లో పురోగతిని, అలాగే మన ద్వైపాక్షిక సంబంధాలలోని ఇతర అంశాలను సమీక్షించేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుంది’’ అని ప్రధాని మోదీ యూరప్ పర్యటకు వెళ్లేముందు తెలిపారు. ఇక, తన పర్యటనలో మోదీ క్వీన్ మార్గరెత్ II ను కూడా కలవనున్నారు. ఇండియా-డెన్మార్క్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌కు హాజరుకానున్నారు. అలాగే డెన్మార్క్‌లోని భారతీయ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవుతారు.
