అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. లూసియానా రాష్ట్రం అసెంప్షన్ ప్రాంతానికి చెందిన డకోటా థెరియోట్ జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఏ పని చేయకపోవడం, రోడ్ల మీద తిరుగుతుండటంతో తల్లీదండ్రులు అతనిని నిత్యం మందలించేవారు.

ఈ క్రమంలో ఓ రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనీ, ఇకపై తిరిగిరావొద్దని పేరెంట్స్ హుకం జారీ చేశారు. దీంతో విచక్షణ కోల్పోయిన థిరియోట్ ఎలాగోలా ఓ తుపాకీని సంపాదించాడు. అనంతరం దానిని పట్టుకుని లివింగ్‌స్టన్ ప్రాంతంలో ఉంటున్న ముగ్గురిని కాల్చేశాడు.

తర్వాత వారింట్లో పార్క్ చేసి ఉన్న ట్రక్కును తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి రావడంతోనే తల్లిదండ్రులపై తుపాకీ గురిపెట్టాడు. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన వారు ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరుగులు తీశారు. అయితే వారిద్దరిని వెంటపడి మరీ డకోటా కాల్చి చంపాడు. అనంతరం ట్రక్కులో అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.