ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పీవోకే‌లో పట్టుకున్న పాక్ కమాండో అహ్మద్ ఖాన్ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లుగా తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలాకోట్‌ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ మనదేశంపై వైమానిక దాడులకు ప్రయత్నించింది. అయితే భారత వాయుసేన పాక్ దాడిని తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జెట్‌లను తరుముకుంటూ వెళ్లిన అభినందన్ మిగ్ 21ను పాక్ సైన్యం కూల్చివేసింది.

ఆ సమయంలో ఆయన పొరపాటున పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగారు. దీంతో అభినందన్‌ను శత్రు సైన్యం పట్టుకుని చిత్రహింసలకు గురిచేసిన సంగతి తెలిసిందే. మన పైలట్ పట్టుబడిన సందర్భంలో విడుదలైన ఫోటోల్లో అహ్మద్ ఖాన్ ఆయన వెనుకే ఉన్నాడు.

ఇతను పాక్ సైన్యం ప్రత్యేక సేవా గ్రూప్‌లో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. చొరబాటుదారులను భారత్‌లోకి పంపడంలో అహ్మద్ కీలకంగా వ్యవహరించేవాడని సమాచారం.

జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులను ఉపయోగించి కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు పాకిస్తాన్ రచించే వ్యూహాలను అతను అమలు చేసేవాడని నిఘా వర్గాలు తెలిపాయి.

ఇదే క్రమంలో ఈ నెల 17న చొరబాటుదారులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తుండగా నాక్యాల్ సెక్టార్ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతను హతమయ్యాడు.