జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్ధితులు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా అధ్యక్షుడు ముందుకొచ్చిన నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్ చర్యలను ఆయన తప్పుబట్టారు.

నియంత్రణ రేఖ వెంబడి అమాయక ప్రజలపై భారత్ చేస్తోన్న దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని.. క్లస్టర్ బాంబులను వినియోగించకూడదని ఒప్పందం చేసుకున్నప్పటికీ భారత్ వాటిని ఉల్లంఘించిందని ఇమ్రాన్ మండిపడ్డారు.

శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను భద్రతా మండలి అంతర్జాతీయ ముప్పుగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్ధాలుగా కశ్మీర్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.

దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే అందుకు కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఒక్కటే మార్గమని ఇమ్రాన్ అన్నారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ .. సరిహద్దుల వెంబడి భారత చర్యలు ఉద్రిక్త వాతావరణానికి కారణమైందిన ఆయన మండిపడ్డారు.

దీని కారణంగా పరిస్ధితులు మరింత క్షీణించే అవకాశం ఉందని.. ఇది ప్రాంతీయ సంక్షోభానికి దారి తీస్తుందని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.