పాక్ భూభాగంలోకి ప్రవేశించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను తిరిగి క్షేమంగా భారత ప్రభుత్వానికి అప్పగించడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై రెండు దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ క్రమంలో భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంతో పాటు శాంతియుత వాతావరణానికి కృషి చేసిన ఇమ్రాన్‌ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

దీనిపై స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... నోబెల్ బహుమతిని పొందేందుకు తాను అర్హుడిని కాదని ప్రకటించారు. కశ్మీరీ ప్రజల ఆకాంక్షల ప్రకారం వివాదాన్ని పరిష్కరించి శాంతి నెలకొల్పినప్పుడే  మానవాభివృద్ధికి దారి తీస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు.

జెనీవా ఒప్పందానికి అనుగుణంగా శాంతి చర్యల్లో భాగంగానే భారతీయ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేసినట్లు ఇమ్రాన్ పార్లమెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే.