ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికే ఇక్కడికి వచ్చానన్నారు. ముజాహిద్దీన్లకు అమెరికాయే శిక్షణ ఇచ్చిందని, ఆ తర్వాత శిక్షణ నిలిపివేసిందని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై మాత్రమే ప్రధాని మోడీ ప్రసంగించారని మరి బలూచిస్తాన్‌లో భారత్ నిర్వహిస్తున్న గూఢచర్యం సంగతేంటనీ ఇమ్రాన్ ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోడీ ప్రచారం మొత్తం పాకిస్తాన్ చుట్టూనే తిరిగిందని ఆయన గుర్తు చేశారు.

పాక్ మీద భారత్ చేసిన దాడిని తిప్పికొట్టామని మేం పట్టుకున్న పైలట్ అభినందన్‌ను సైతం విడిచిపెట్టామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఉద్రిక్తతలు పెరగకూడదని తాము ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు.

దానిని సహృద్భావ చర్యగా చూడకుండా రాజకీయ విజయంగా వాడుకున్నారని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని ఎత్తివేశారని.. 80 లక్షల మంది ప్రజల్ని కర్ఫ్యూలో పెట్టారన్నారు.

మోడీ ఆర్ఎస్ఎస్‌లో సభ్యుడని.. హిట్లర్, ముస్సోలిని సిద్ధాంతాల ఆధారంగానే ఆ సంస్ధ పుట్టిందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. భారత్ నుంచి ముస్లింలను తుడిచిపెట్టడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముస్లింల పట్ల ద్వేషం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో భాగమని పాక్ ప్రధాని చెప్పారు.

ఈ ద్వేషమే గాంధీని చంపేసిందని ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లో టెర్రరిస్టులు తయారవుతున్నారని కాంగ్రెస్ హోంమంత్రే చెప్పారని ఇమ్రాన్ గుర్తుచేశారు. జాత్యాహంకారంతోనే ఇలాంటి మూర్ఖపు చర్యలకు పాల్పడుతున్నారని.. కాశ్మీరీలు ఈ పరిస్థితిని మౌనంగా సహిస్తారని అనుకోవద్దన్నారు. 

భారత్ పెద్ద దేశం కాబట్టే కాశ్మీర్ విషయంలో ప్రపంచం మౌనంగా చూస్తోందన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేయగానే నెత్తురు పారుతుందన్నారు.

కర్ఫ్యూ ఎత్తివేస్తే కాశ్మీరీలు ఒక్కసారిగా రోడ్ల మీదకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు భారత సైన్యం వాళ్లను కాల్చి చంపేస్తుందని, ఆ సమయంలో కూడా ఇండియా పాకిస్తాన్‌దే తప్పుంటుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే సరిహద్దుల్లో 500 మంది తీవ్రవాదులున్నారని భారత రక్షణ మంత్రి అంటున్నారని.. కాశ్మీర్‌లో పరిస్ధితిని దేశంలోని కోట్లాది మంది ముస్లీంలు గమనిస్తున్నారన్నారు.

ఇది కాశ్మీరీ ముస్లింలను హింసించడమని ప్రపంచంలోని ముస్లీంలదరికీ తెలుసునని ఇమ్రాన్ వెల్లడించారు. కాశ్మీర్‌లో నెత్తురుపారితే దాని వల్ల ముస్లీంలు హింసకు దిగుతారని అది మతం వల్ల వచ్చింది కాదన్నారు.

ఆ పరిస్ధితిలో నేనున్నా అదే పనిచేస్తానని రెండు అణ్వాయుధ దేశాలు తలపడితే ఆ పరిస్ధితులను నివారించాల్సిన బాధ్యత ఐరాసదేనని ఆయన గుర్తుచేశారు. ఇందులో యూఎన్ విఫలమైతే జరగరానిది జరుగుతుందని అందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇమ్రాన్ చురకలంటించారు.