జమ్మూకాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ భారత దౌత్య వ్యూహం ముందు పాకిస్తాన్ నిలబడలేకపోతోంది. ఒకటి రెండు దేశాలు తప్పించి మిగిలిన పెద్ద దేశాలు పాక్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

దీంతో పాకిస్తాన్ ప్రధాని కొత్త వాదనకు తెరదీశారు. భారతదేశ అణ్వస్త్ర విధానంలోకి వేలుపెట్టారు. ఇండియాలోని అణ్వస్త్రాల భద్రతపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. అంతర్జాతీయ సమాజం కలగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మోడీ సర్కార్ పాక్‌తో పాటు ప్రాంతీయంగా ముప్పు కలగజేస్తోంది ఇమ్రాన్ ఆరోపించారు. ఎన్‌ఆర్‌సీతో కొన్ని వర్గాలకు నష్టం కలిగే అవకాశం ఉందంటూ దానిపై ఎలాంటి అవగాహన లేకుండానే వ్యాఖ్యానించారు.

కాగా ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తొలిసారి ప్రయోగించబోమన్న విధానానికి కట్టుబడి ఉన్నామని... అయితే భవిష్యత్తు పరిణామాలు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు.

రాజ్‌నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అయితే ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తానని హామీ ఇచ్చిన ఇమ్రాన్.. ఆచరణలో మాత్రం విఫలమవుతున్నారు.

దీనిపై ఆ దేశ ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.. దీంతో పాకిస్తానీయుల దృష్టిని మరల్చడానికి కాశ్మీర్‌ అంశాన్ని వాడుకుందామని ఇమ్రాన్ ఎత్తు వేశారు. మోడీ, అమిత్ షా వ్యూహాలతో అది కాస్తా బెడిసికొట్టంది.