పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాకిస్తాన్ కరెన్సీ దారుణంగా పతనం కావడంతో విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకోవడానికి తంటాలు పడుతున్నది. దేశీయంగా పైపైకి వెళ్తున్న సరుకుల ధరలకు కళ్లెం వేయలేకపోతున్నది.

న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు చక్కబడలేదు. ఆర్థిక సంక్షోభంతో ఏకంగా ప్రభుత్వమే మారిపోయింది. సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ వంటి కనీస సేవలు కూడా వారు పొందలేకపోతున్నారు. నిత్యావసర సరుకులూ అందుబాటులో ఉండటం లేదు. తాజాగా పాకిస్తాన్ కూడా శ్రీలంక బాటలోనే వెళ్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయి.

ఈ రోజు నుంచి పాకిస్తాన్ వంట నూనె, నెయ్యి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వంట నూనెపై రూ. 213, నెయ్యిపై రూ. 208 పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో కిలో వంట నూనె ధర రూ. 555కు, లీటర్ నెయ్యి ధర రూ. 605కి పెరిగింది. ఇది ఆ దేశంలో ఆల్ టైం హైయ్యెస్ట్ ధరలు. అయితే, ఈ పెంపునకు గల కారణాలు మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించలేదు.

పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ కథనం ప్రకారం, పాకిస్తాన్ వనస్పతి మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (పీవీఎంఏ) సెక్రెటరీ జనరల్ ఉమెర్ ఇస్లాం ఖాన్.. పాకిస్తాన్ యుటిలిటీ సర్వీస్ కార్పొరేషన్ ఇంకా తయారీదారులకు బకాయిలు చెల్లించాల్సే ఉన్నదని అన్నారు. 2 నుంచి 3 బిలియన్ రూపీల మొత్తాలు యూఎస్‌సీ చెల్లించాల్సి ఉన్నదని వివరించారు.

అదే విధంగా ఆయన ఇండోనేషియా నుంచి ఆగిన పామాయిల్ దిగుమతులను ప్రస్తావించారు. పామాయిల్ సరఫరాలపై ప్రధానమంత్రి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారని, ఇందులో కీలక మంత్రిత్వ శాఖల అధికారులు ఉన్నారని వివరించారు. ఈ నేతలు రోజూ జూమ్ సెషన్స్‌లో డిమాండ్, సప్లై, ప్రస్తుత పరిస్థితులపై చర్చలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఇండోనేషియా ఎగుమతులపై ఆంక్షలు ఎత్తేసినప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్‌కు పామాయిల్ దిగుమతులు రాలేవని వివరించారు. మే 23 నాటికి ఇండోనేషియా పోర్టులో పాకిస్తాన్‌కు వచ్చే ఒక్క పామాయిల్ షిప్ కూడా లేదని తెలిపారు.

పాకిస్తాన్ కరెన్సీ దారుణంగా పతనం అయింది. ఫలితంగా పామాయిల్ దిగుమతులకు అనుకున్న దాని కన్నా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తున్నది. అందుకే పామాాయిల్ షిప్‌మెంట్లను బుక్ చేసినప్పటికీ దేశంలో పామాయిల్ ధరలు తగ్గడం లేదని ఆయన వివరించారు. అయితే.. ఇక్కడే ఆయన మరో విషయాన్ని కూడా చెప్పారు. ఇండోనేషియాలో పామాయిల్ ధరలు తగ్గిపోయాయన్న విషయాన్నీ ప్రస్తావించారు. రెండు నెలల క్రితం ఇక్కడ ఒక టన్ను పామాయిల్‌కు 1900 నుంచి 2000 అమెరికన్ డాలర్లు ఉన్నాయని, ప్రస్తుతం టన్ను పామాయిల్ ధర 1700 అమెరికన్ డాలర్లకు పడిపోయిందని తెలిపారు.

ఇది వరకే పాకిస్తాన్ రూపీ దారుణంగా పడిపోవడమే కాదు.. రెండేళ్లలో కనిష్ట స్థాయికి పాకిస్తాన్ కరెన్సీ పడిపోయే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. మే నెలలో పాకిస్తాన్ కరెన్సీ 7 శాతం మేరకు పడిపోయింది. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో 2020 మార్చి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం అదే తొలిసారి. 

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్నదని మరో విషయం కూడా వెల్లడిస్తున్నది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రక్షణ ప్యాకేజీ కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నది. స్నేహపూరిత దేశాల నుంచీ ఆర్థిక సహకారాన్ని కోరుతున్నది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి, దివాళా నుంచి రక్షించుకోవడానికి పాకిస్తాన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.