ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవిశ్వాసంపై ఓటింగ్ నేపథ్యంలో సభను వాయిదా వేశారు పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్
పాకిస్తాన్‌లో (pakistan) రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై (imran khan) పెట్టిన అవిశ్వాసంపై (no trust vote) ఓటింగ్ జరపాలని పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ను (pakistan national assembly) సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే మరోసారి ఇమ్రాన్‌ను కాపాడేలా స్పీకర్ వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అవిశ్వాసంపై ఓటింగ్ నేపథ్యంలో సభను వాయిదా వేశారు పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్.
అంతకుముందు ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జాతీయ అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే గందరగోళం నెలకొనడంతో సభను కొంతసేపు వాయిదా వేశారు స్పీకర్. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా.. చర్చకు స్పీకర్, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సభ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల ప్రకారం.. సభలో వెంటనే ఓటింగ్ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే పాక్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు విదేశీ కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై చర్చ జరపాలని స్పీకర్ భావించారు. దీంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఓటింగ్ ఆలస్యం అయ్యేలా చేస్తోందని దుయ్యబట్టాయి.
అయితే ఇంతటి కీలక సమావేశానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన స్థానంలో విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖురేషీ హాజరయ్యారు. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విదేశీ కుట్ర జరిగిందని రుజువు చేయడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఖురేషీ వ్యాఖ్యానించారు. ఈ రోజు తమ ప్రభుత్వం దిగిపోయినా ఏదో ఒక రోజు ఆ నిజాలు వెలుగుచూస్తాయని.. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
అంతకుముందు పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (nawaz sharif) కుమార్తె మర్యమ్ నవాజ్ షరీఫ్ (maryam nawaz) ఇమ్రాన్ ఖాన్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ భారత్ కు వెళ్లిపోవాలని సూచించారు. ఇటీవల కాలంలో పాక్ ప్రధాని మన దేశంపై ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో మర్యమ్ నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎమ్‌ఎల్-ఎన్) కు మర్యమ్ నవాజ్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు భారతదేశం అంతగా నచ్చితే ఆయన అక్కడికే వెళ్లిపోవాలని అన్నారు. ‘‘ ఈ అధికారం పోయిందని చూసి వెర్రితలలు వేస్తున్న వ్యక్తికి ఎవరైనా చెప్పాలి. ఆయనను సొంత పార్టీయే తరిమికొట్టిందని, మరెవరో కాదని తెలపాలి. మీకు భారత్ అంటే అంత ఇష్టమైతే అక్కడికి వెళ్లిపోండి. పాకిస్థాన్‌ను వదిలివేయండి ’’ అని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ భారత ప్రజలను ‘‘ఖుద్దర్ క్వామ్’’ (చాలా ఆత్మగౌరవ ప్రజలు) గా అభివర్ణించిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా మాట్లాడారు.
