పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మొహమ్మద్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిన సంగతి తెలిసిందే. బాలాకోట్‌లోని జైషే స్థావరంపై చేసిన దాడి నుంచి పాక్ ఇంకా తేరుకోలేదు.

ఈ క్రమంలో మరో దాడి జరిగితే దాని నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై పాకిస్తాన్ తన ఉగ్ర మిత్రులకు సూచనలు ఇస్తోంది. పాక్ మిలటరీకి చెందిన ఆర్మీ యూనిఫామ్‌లను ధరిస్తే.. భారత దళాలు వారిని గుర్తించలేవని సలహా ఇచ్చినట్లు సమాచారం.

ఈ నెల 16న నికాయాల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పాక్ మిలటరీ అధికారులకు ఓ సమావేశం జరిగింది. ఇందులో పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన ఇద్దరు సభ్యులు, ఇద్దరు ఆర్మీ అధికారులు, లష్కరే తోయిబా తీవ్రవాదులు  పాల్గొన్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే చాలా ఉగ్ర తండాలను పాక్ ఆర్మీ క్యాంపుల్లో కలిపేశారని భారత నిఘా వర్గాల సమాచారం. అలా వీలు కానీ ఉగ్రవాద సంస్థలకు దాడుల నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీ పలు సూచనలు చేసింది.

భారత్‌కు చెందిన శాటిలైట్లు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై నిరంతరం నిఘా ఉంచుతాయని.. దీంతో ఉగ్ర శిబిరాల నుంచి బయటకు వచ్చే సమయంలో తీవ్రవాదులు ఆర్మీ దుస్తులు ధరించాలని సూచించింది.

మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి  నాలుగు జైషే, లష్కర్ క్యాంపులు ఉన్నట్లు సమాచారం. దాడుల నుంచి తప్పించుకునేందుకు ఎల్‌ఓసీ నుంచి దూరంగా ఉండాలని ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ  తెలిపింది.