పాకిస్తాన్.. ఒక సూపర్ టెర్రరిస్టు దేశంగా దానికదే చెప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నదని, అందుకే ఓ టెర్రరిజం సానుభూతిపరుడిని అమెరికాకు దూతగా పంపాలని నిర్ణయం తీసుకున్నదని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు స్కాట్ పెర్రి విమర్శలు చేశారు. అమెరికాకు పాకిస్తాన్ దూతగా మసూద్ ఖాన్‌ను నియమించడాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని ఆయన అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాసి కోరారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్(Pakistan) తీరుపై అమెరికన్ కాంగ్రెస్(America Congress) సభ్యుడు ఒకరు నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ దాని నిర్ణయాలతో అది ఒక ఉగ్రవాద దేశంగా రూఢీ చేసుకుంటున్నదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ఉగ్రవాద సానుభూతిపరుడిని(Terrorist Sympathizer) అమెరికాకు దూత(Ambassador)గా ఎంపిక చేసిందని మండిపడ్డారు. ఇది అమెరికాను తీవ్రస్థాయిలో ధిక్కరించినట్టేనని తెలిపారు. ఆ రీజియన్‌లో అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా పాకిస్తాన్ నిర్ణయం ఉన్నదని, అంతేకాదు, అదే రీజియన్‌లోని అమెరికా మిత్ర దేశం భారత దేశ భద్రతనూ ముప్పులోకి నెట్టే నిర్ణయం అది అని పేర్కొన్నారు. అందుకే అమెరికాకు పాకిస్తాన్ దూతగా మసూద్ ఖాన్‌ను అంగీకరించవద్దని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు స్కాట్ పెర్రీ.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు.
పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు తమ దూతగా ఎంచుకున్న మసూద్ ఖాన్ నిర్ణయాన్ని అమెరికా ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టిందని ఆయన వివరించారు. అయితే, ఇది సరిపోదని, ఆ నిర్ణయాన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలని అధ్యక్షుడు జో బైడెన్‌ను కోరారు. ఈ లేఖలోనే మసూద్ ఖాన్ గత చరిత్రను చూచాయగా ప్రస్తావించారు. ఆయనకు ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలతో ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టారు.
మసూద్ ఖాన్ ఉగ్రవాదులు, హిజ్బుల్ ముజాహిదీన్ సహా విదేశీ ఉగ్రవాద సంస్థలనూ పలుసార్లు ప్రశంసించారని స్కాట్ పెర్రీ తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, భారత దేశానికి వ్యతిరేకంగా పవిత్ర యుద్ధాన్ని ప్రకటించి, అందుకోసమే తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఉగ్రవాది బుర్హన్ వనీ లాంటి యువ జిహాదిస్టులను, యువ ఉగ్రవాదులను ఆయన ప్రోత్సహించారని పేర్కొన్నారు. బుర్హన్ వనీ జమ్ము కశ్మీర్‌లో పేరుమోసిన యువ ఉగ్రవాది. టెక్నాలజీలో మంచి పట్టు ఉండటంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది కశ్మీరీ యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించగలిగాడు. చివరకు భారత భద్రతా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ నేతపై ఆంక్షలు విధించిన అమెరికాపై 2017లో మసూద్ ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని గుర్తు చేశారు. ఆ ఆంక్షలు న్యాయసమ్మతం కావని యూఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని తెలిపారు. అమెరికా ధ్రువీకరించిన విదేశీ ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ ముజాహిదీన్‌ను వ్యవస్థాపించిన అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఫజలూర్ రెహ్మాన్ ఖలీల్ పక్కన 2019లో మసూద్ ఖాన్ కావాలనే కనిపించాడని స్కాట్ పెర్రీ వివరించారు. ఖలీల్‌ను ప్రత్యేక అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సమర్థించిందని గుర్తు చేశారు. ఎందుకంటే ఆయనకు ఉసామా బిన్ లాడెన్(మరణానికి ముందు) సహా అల్ ఖైదాతో సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. అమెరికాపై దాడులకు పిలుపునిస్తూ 1998లో యూబీఎల్ తొలి ఫత్వా జారీ చేసింది. అప్పుడు ఆ యూబీఎల్‌లో ఖలీల్ సభ్యుడిగా ఉన్నారని వివరించారు.
పాకిస్తాన్ ఒక సూపర్ టెర్రరిస్టు కంట్రీగా తనకు తానే చూపించుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే.. అది ప్రతిపాదించిన దౌత్య అధికారి మసూద్ ఖాన్ జమాత్ ఎ ఇస్లామీకి మద్దతుదారుడని తెలిపారు. 2008లో ముంబయి దాడుల వెనుక ఉన్న లష్కర్ ఎ తాయిబా వంటి ఉగ్రవాద సంస్థలతోనూ ఈ జమాత్ ఎ ఇస్లామీకి సంబంధాలు ఉన్నాయని వివరించారు. 2010లో అమెరికన్ ట్రూపులను హతమార్చాలని ప్రయత్నాలు చేసిన ఆఫియా సిద్దిఖీతో మసూద్ ఖాన్ సమావేశం అయ్యాడని పేర్కొన్నారు. అప్పటి నుంచి జిహాదిస్టు గ్రూపులు ఆయనను విడుదల చేయాలని పలుసార్లు అమెరికాలోనూ దారుణాలకు పాల్పడుతారని వివరించారు. అలాంటి మసూద్ ఖాన్‌ను అమెరికాకు పాకిస్తాన్ దౌత్య అధికారిగా నియమించడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని, మరే విధమైన ప్రయత్నాలు చేసినా అంగీకరించవద్దని పెన్సిల్వేనియా కాంగ్రెస్ సభ్యుడు స్కాట్ పెర్రీ.. దేశాధ్యక్షుడు జో బైడెన్‌ను ఓ లేఖలో కోరారు.
