న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 మిషన్ పై పాకిస్తాన్ మంత్రి నోరు పారేసుకున్నారు. తద్వారా పాకిస్తాన్ భారత్ పట్ల తన కక్షను మరోసారి బయటపెట్టుకుంది. భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రయోగంపై పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ట్విట్టర్ వేదికగా పిచ్చి ప్రేలాపన చేశారు. 

ఎండియా... చేతకాని పని జోలికి వెళ్లకూడదు. బొక్క బోర్లా పడకూడదు అని ట్వీట్ చేశారు. దానిపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పొరుగువారి ప్రగతి చూసి సహించలేనివారే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని దుయ్యబట్టారు. ఫవాద్ కు కూడా చంద్రయాన్ 2 నిద్ర లేకుండా చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అదే నవ్వు తెప్పించే విషయమని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. 

తనపై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతుండడంతో ఫవాద్ మరోసారి స్పందించారు. చంద్రయాన్ 2కు తగిలిన ఎదురు దెబ్బకు తానే కారణమైనట్లు తనను ట్రోల్ చేస్తారేమిటని ప్రశ్నించ్ారు. విఫల ప్రయత్నాలపై రూ. 900 కోట్లు ఖర్చు చేయాలని మీకు నేను చెప్పానా అని కూడా అడిగారు. 

భారత ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఫవాద్ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు. తానేదో ఆస్ట్రోనాట్ అయినట్లు స్పీచ్ లు దంచుతున్నారని మోడీని ఉద్దేశించి అన్నారు. పేద దేశమైన భారత్ చంద్రయాన్ -2పై రూ. 900 కోట్లు ఖర్చు చేసినందుకు పార్లమెంట్ మోడీని నిలదీయాలని ఓ ఉచిత సలహా పారేశారు. 

ఫవాద్ వ్యాఖ్యలను పాకిస్తానీయులు కూడా తప్పు పట్టారు. మనలాగా కాకుండా చంద్రుడిపై కాలు మోపేందుకు భారత్ ప్రయత్నించిందని, వీలైతే వారి భుజం తట్టాలని, వారి నుంచి స్ఫూర్తి పొందాలని, కానీ పాక్ పరువు తీసే వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు.