పుల్వామాలో సీఆర్‌‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం  సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను భారత్.. పాకిస్తాన్‌కు అందజేసింది.

అయినప్పటికీ పాక్ నిజాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. భారత దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని, చెట్లు కూలిపోయాయని, బాంబులు గురి తప్పాయంటూ రకరకాలుగా కథనాలు చెప్పిన పాకిస్తాన్ తాజాగా మరో కట్టుకథ చెప్పింది.

భారత్ ఇచ్చిన ఆధారాలపై తాము దర్యాప్తు జరిపామని, దాడి జరిగినట్లుగా చెప్పిన ప్రాంతాల్లో అసలు ఉగ్ర శిబిరాలే లేవని చెబుతోంది. కావాలంటే భారత్‌కు ఆ ప్రాంతాలు చూపిస్తామని స్పష్టం చేసింది.

పుల్వామా దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్రకు సంబంధించిన కీలక పత్రాలను ఫిబ్రవరి 27న భారత్.. ఢిల్లీలోని పాక్ తాత్కాలిక హైకమిషనర్‌కు అందించింది. ఈ పత్రాలు అందిన వెంటనే పాక్ ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

చాలా మందిని అదుపులోకి తీసుకుని విచారించామని, సోషల్ మీడియా ఖాతాలపై కూడా దర్యాప్తు జరిపామని పేర్కొంది. భారత్ ఇచ్చిన జాబితాలో 54 మంది అనుమానితులను విచారించామని, వారికి పుల్వామా దాడితో సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పాక్ విదేశాంగ  శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.