ఇస్లామాబాద్: భారత్ తో  ఎట్టి పరిస్థితుల్లో చర్చించేది లేదని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. కాశ్మీర్ లొ 370 ఆర్టికల్ ను భారత్ రద్దు చేయడంపై పాక్ రగిలిపోతోంది.ఈ విషయమై పాక్ అంతర్జాతీయ వేదికలపై తమ వాదనను విన్పించే ప్రయత్నం చేసినా పెద్దగా మద్దతు లభించలేదు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్  ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విదేశీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికకకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శాంతి కోసం భారత్ తో తాను చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ భారత్ కేవలం బుజ్జగింపు మాదిరిగానే  చూస్తోందన్నారు. ఇంతకు మించి తాను ఏమీ చేయలేనన్నారు. అణ్వస్త్ర బలం ఉన్న రెండు దేశాల మధ్య రోజు రోజుకు యుద్ద వాతావరణం పెరుగుతుందన్నారు. ఈ విషయమై తాను ఆందోళన చెందుతున్నట్టుగా ఆయన తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దుపై తాను తాడొపేడో తేల్చుకొంటానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.ఈ విషయమై ఐక్యరాజ్యసమితిలో తన వాదనను మరింత బలంగా విన్పిస్తానని ఆయన చెప్పారు.