న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై లైంగిక వేదింపుల ఆరోపణలు వచ్చిన నేపత్యంలో న్యూయార్క్ గవర్నర్ కార్యాలయంలో పనిచేస్తున్న దాదాపు 12 మంది సిబ్బందికి ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.

ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అటార్నీ జనరల్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న వారిలో ఆండ్రూ క్యమో కార్యదర్శి కూడా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఈ విషయం మీద రాయిటర్స్, క్యూమో అధికార ప్రతినిధిని వివరణ కోరింది. 

అయితే దానికి సదరు ప్రతినిధి స్పందించనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గతంలో ఆండ్రూ క్యూమో వద్ద పని చేసిన దాదాపు ఏడుగురు మహిళలు ఆయన మీద లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చట్టసభ సభ్యులు కొందరు ఆండ్రూ క్యూమో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆండ్రూ క్యూమో దానికి నిరాకరించారు. 

అంతేకాకుండా తనమీద వచ్చిన ఆరోపణలను ఖండించారు. దీంతో ఈ విషయాన్ని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సీరియస్ గా తీసుకున్నారు. అభిశంసన దర్యాప్తు కోసం జ్యూడీషియల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయం, ఆండ్రూ క్యూమో కార్యాలయ సిబ్బందికి నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వెలువడడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.