కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. దీనికి ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని కాస్త ఊపిరి పీల్చుకునేలోగా.. స్ట్రైయిన్ పేరిట మరో కరోనా చుట్టుముట్టేస్తోంది. అయితే.. ఈ కరోనా టీకానే.. ఆ వైరస్ మీద కూడా పనిచేస్తుందని అందరూ భావించారు. కానీ.. ఈ స్ట్రైయిన్ పై కరోనా టీకా పనిచేయదంటూ బ్రిటన్ కి చెందిన ఓ టీవీ ఛానెల్ లో ఇటీవల ఓ కథనం ప్రసారమైంది. కాగా.. ఈ కథనం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త కరోనా స్ట్రెయిన్‌ను ప్రస్తుతమున్న టీకాలు నిలువరించలేక పోవచ్చని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నట్టు అక్కడి ఐటీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. బ్రిటన్‌ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న శాస్త్రవేత్త ఒకరు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. అయితే.. సదరు శాస్త్రవేత్త వివరాలను మాత్రం వెల్లడించాలేదు. దక్షిణ ఆఫ్రికా‌లోని కరోనా స్ట్రెయిన్ తమను ఎంతో ఆందోళనకు గురించేస్తోందన్న బ్రిటన్ ఆరోగ్య శాఖ సెక్రటరీ వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కథనం సంచలనానికి దారితీసింది.

బ్రిటన్‌లోని కరోనా స్ట్రేయిన్లు లక్ష్యంగానే ప్రస్తుత టీకాలు తయారయ్యాయి కాబట్టి దక్షిణాఫ్రికాలోని స్ట్రెయిన్‌పై ఇవి ప్రభావం చూపకపోవచ్చని ఓ ప్రభుత్వ సలహాదారు అభిప్రాయపడినట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ వ్యాఖ్యానించారు. కాగా.. బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లోనూ కొత్త కరోనా స్ట్రెయిన్లు బయటపడిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లోని కొత్త కరోనా స్ట్రెయిన్ కంటే దక్షిణాఫ్రికాకు చెందిన వైరస్ భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్ట్రెయిన్ కారణంగా వ్యాధి వేగంగా వ్యాపించడంతో పాటూ బాధితుల శరీరాల్లో వైరస్ కణాల సంఖ్య అధికంగా ఉన్నట్టు వారు గుర్తించారు.