న్యూఢిల్లీ: ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక వ్యాఖ్య చేశారు. బయటకు  చూడడానికి ఇది చాలా సాదాసీదాగా అనిపించినా నిగూడంగా మాత్రం చాలా అర్థాన్ని కలిగి ఉంది. అందరూ ఊహించినట్టే తీవ్రవాదం పై చాలాసేపు మాట్లాడిన ప్రధాని ఎక్కడా కూడా పాకిస్తాన్ పేరును వాడలేదు. ఉపఖండంలోని మిగిలిన దేశాలు కూడా తీవ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయని దీని గురించి అందరూ ఆలోచించాలని పాకిస్తాన్ పేరెత్తకుండానే చెప్పాలనుకున్నది చెప్పారు. 

ఈ సంవత్సరం విడుదలైన ఆర్ధిక సర్వేలో బిహేవియరల్ ఎకనామిక్స్ గురించిన ప్రస్తావన మనకు తొలిసారిగా కనపడుతుంది. బిహేవియరల్ ఎకనామిక్స్ అంటే ఆలోచనా సరళిని ప్రభావితం చేయడం ద్వారా అనుకున్న ఆర్ధిక లక్ష్యాలను చేరుకోవడం. ఉదాహరణకు ప్రధాని గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ అవసరం లేనివారు వదులుకోవాల్సిందిగా కోరగానే చాలామంది ముందుకొచ్చారు. ప్రభుత్వము తనవంతు కృషి చేస్తుంది. పౌరుడిగా దేశానికి నువ్వు ఏమి చేస్తున్నావు అనే ప్రశ్నను లేవనెత్తి కర్తవ్య బోధ చేయడం. ఈ తరహా ఆలోచనా సరళిని ప్రభావితం చేసే కార్యక్రమాలను మన దేశం వరకే చూసాం. కానీ తన స్వతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని గనుక లోతుగా పరిశీలిస్తే ఈ సారి మోడీ సరిహద్దులు దాటించాడన్న విషయం మనకు అర్థమవుతుంది. 

పాకిస్తాన్ ను జీహాదీ యూనివర్సిటీ అని, తీవ్రవాదుల పురిటిగడ్డ అని ఇలా రకరకాల పేర్లతో పిలవడం మనమందరం చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. మోడీ మాట్లాడుతూ పాకిస్తాన్ పేరెత్తకుండానే ఉపఖండంలో ఇతర దేశాలన్నీకూడా తీవ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. అందరం కలిసి పనిచేయాలి అని అన్నారు. ముఖ్యంగా మోడీ బాంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ లను ఉద్దేశించి మాట్లాడారు. దీనర్థం ఈ తీవ్రవాదం ఎక్కడినుండి ఉత్పన్నమవుతుందో మీరే ఆలోచించండి అని చెప్పకనే చెప్పారు. 

ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ లకు అధికారాన్ని కట్టబెట్టి తమ సేనలను ఆఫ్ఘన్ గడ్డపైనుంచి వెనక్కు రప్పించాలని ట్రంప్ భావిస్తున్నాడు. 2020లో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి. గత పర్యాయం ఆయన ఎన్నికల ప్రచార సందర్బంగా పలుమార్లు ఆఫ్గనిస్తాన్ లో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తమ సేనలను వెనక్కి రప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు మరోమారు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఈ విషయమై ప్రజలనుంచి వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. అందుకని హడావుడిగా అక్కడేదో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తమ సేనలను వెనక్కి రప్పించాలని తొందరపడుతున్నాడు. 

ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు నిర్వహించడం కష్టసాధ్యమైన పని కనుక తాలిబన్ ల నేతృత్వంలో ఒక డమ్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ భావిస్తున్నాడు. ఈ తాలిబన్ లను ఆడిస్తుంది ఐ ఎస్ ఐ అనేది జగమెరిగిన వాస్తవం. భారత దేశం పట్ల అక్కడ ప్రజల్లో చాలా మంచి దృక్పథం ఉంది. అక్కడ భారత్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్ సేనల  నేతృత్వములో అక్కడ ప్రభుత్వం ఏర్పడితే  ఇక ఆఫ్గనిస్తాన్ విషయంలో భారత్ ఏమీ చేయలేదు. భారత్ ఆఫ్గనిస్తాన్ విషయంలో ఏమీ చేయలేకపోయినా పెద్దగా వచ్చే నష్టం ఏమి లేకున్నా భారత్ లో తీవ్రవాద కార్యకలాపాలు మాత్రం ఎక్కువవుతాయి. పాకిస్తాన్ ఆ తాలిబన్ సేనలను భారత్ పైకి ఉసిగొలిపి ఇక్కడ మారణ హోమం సృష్టిస్తుంది. 

ఈ రోజు తాజాగా ప్రధాని ఆఫ్ఘన్ ప్రజలకు అడ్వాన్స్ గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారి స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకున్న 4 రోజుల తరువాత వస్తుంది.  వారికి ఈ సంవత్సరం 100వ స్వాతంత్ర దినోత్సవం. ఇలా తీవ్రవాదం గురించి మాట్లాడుతూ వారికి వారి 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేయడం ఒక రకంగా ఆఫ్ఘన్ జాతీయతను తట్టి లేపడమే. ఆఫ్గనిస్తాన్ లోకి వచ్చిన ఏ దేశం కూడా అక్కడ గెలిచిన దాఖలాలు లేవు. వారిలో జాతీయతా భావాలు గనుక ఎక్కువైతే ఆఫ్గనిస్తాన్ ని చూపెట్టి ఆటలాడుదామనుకున్న పాకిస్తాన్ పరిస్థితి, అక్కడ డమ్మీ ప్రభుత్వాన్ని నిలబెట్టి వెనుక నుండి ఆడిద్దామనుకున్న అమెరికా పరిస్థితి  కుడితిలో పడ్డ ఎలుకలా మారుతుంది. 

మొత్తానికి బిహేవియరల్ ఎకనామిక్స్ అని చిన్నగా ఆర్ధిక రంగంలో పరిచయం చేసి, ఇప్పుడు ఏకంగా బిహేవియరల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్థాయికి  దాన్ని మార్చి అంతర్జాతీయ రాజకీయాలను భారతదేశానికి అనుకూలంగా మార్చగలిగారు ప్రధాని నరేంద్ర మోడీ.