సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఆర్డర్‌లు వచ్చేస్తున్నాయి.

ఇప్పటికే బంగ్లాదేశ్‌ కోవిషీల్డ్‌ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. తాజాగా మరో పొరుగుదేశం మయన్మార్... చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో భాగంగా కోవిషీల్డ్‌ కొనుగోలుకు నిర్ణయించింది. 

మయన్మార్‌లోని భారత హై కమీషనర్ సౌరభ్ కుమార్ గత వారం ఆ దేశ ఆరోగ్య మంత్రి యు మైంట్‌ హవేను గత వారం కలిశారు. ఈ సందర్భంగా సీరం నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుపై చర్చించారు. 

54.4 మిలియన్ల జనాభా వున్న మయన్మార్‌లో 20 శాతం మందికి ఏప్రిల్‌లో కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే టీకా అందించే లాజిస్టిక్స్ గురించి భారతదేశంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

కోవిడ్ 19 వ్యాక్సిన్ల కొనుగోలుకు నిధులు సమకూర్చడానికి 950 మిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయి. దీంతో మయన్మార్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)తో చర్చలు జరిపింది.

అయితే ఒక్క చైనా వ్యాక్సిన్లపై ఆధారపడకుండా భారత్, యూఎస్, యూకే, రష్యా తదితర దేశాల నుంచి టీకాలు కొనుగోలు చేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. 

కాగా గత గురువారం నాటికి మయన్మార్‌లో 1,18,869 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,507 మరణాలు, 99,325 మంది కోలుకున్నారు. డిసెంబర్ 19 నుంచి ఇక్కడ రోజుకు వెయ్యి కంటే తక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఒక్కరోజుకు 1,400 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యేవి. 

గతేడాదది అక్టోబర్‌లో మయన్మార్‌ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ ష్రింగ్లా.. టీకా అభివృద్ధ, మందుల సరఫరా, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర మార్గాల ద్వారా కోవిడ్‌ను తగ్గించేందుకు విస్తృతమైన చర్చలు జరిపారు. 

అంతకుముందు బంగ్లాదేశ్.. కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం సీరంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనా కోసం ఆమోదించిన వ్యాక్సిన్‌ను తీసుకువచ్చే ప్రయత్నంలో బంగ్లాదేశ్‌కు చెందిన బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (బిపిఎల్) సీరం‌తో కలిసి పెట్టుబడులు పెట్టనుంది. బిపిఎల్.. బంగ్లాదేశ్‌లోని కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం సీరమ్‌కు ప్రత్యేక పంపిణీదారుగా ఉంటుంది.