ఉక్రెయిన్‌లో భయంకర దృశ్యాలు బయటకు వస్తున్నాయి. రాజధాని నగరం కీవ్‌లోని ఓ పార్క్‌లో ఉక్రెయిన్ పౌరుడు నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన కళ్ల ముందే ఓ క్షిపణి బ్లాస్ట్ అయింది. ఈ భయానక దృశ్యాలు ఆ పార్క్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, కీవ్ నగరంలోని ఓ పార్క్‌కు చెందిన సీసీటీవీ వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఓ ఉక్రెయిన్ పౌరుడు పార్క్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా.. రష్యా పంపిన మిస్సైల్ కళ్ల ముందే బ్లాస్ట్ అయింది. ఆ పేలుడు తీవ్రత, శబ్దానికి ఆ పౌరుడు ఉలిక్కిపడ్డాడు. షాక్‌లోకి వెళ్లాడు. వెంటనే వెనుదిరిగి పరుగు తీశాడు. కొద్దీ దూరం వెళ్లే వరకు ఆయనకు ఏం జరిగిందో అర్థం కానట్టే నడిచాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యా సైన్యం రెండు వైపుల నుంచి మోహరించి ఉన్నది. ఈ నగరంలో 30 లక్షల మంది పౌరులు నివసిస్తుండేవారు. కానీ, రష్యా దాడులు ప్రారంభించిన కారణంగా సుమారు సగం మంది నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. తాజా రష్యా దాడిలో ఇక్కడ ఇద్దరు పౌరులు దుర్మరణం చెందారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో కీవ్ నగరంలోని కిరిలివ్‌స్కా వీధిలోని పార్క్ కనిపిస్తున్నది.
కీవ్ నగరానికి వాయవ్య భాగంలో రష్యా దాడులను పెంచింది. ఈ ప్రాంతంలో లాంగ్ రేంజ్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. సోమవారం ఒక్క రోజే ఇక్కడ ఇద్దరు పౌరులు మరణించారు. కనీసం 12 మంది ఇతర పౌరులు గాయపడ్డారు. కాగా, కీవ్ నగరం ఈశాన్యం వైపున ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువ. వీటిని ఇండస్ట్రియల్ జిల్లాలుగా పేర్కొంటారు. రష్యా తన తదుపరి దాడుల్లో ఈ పారిశ్రామిక జిల్లాలను లక్ష్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆందోళనలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, దేశంలో మార్చి 24 నుండి మరో 30 రోజుల పాటు మార్షల్ లా పొడిగించాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సోమవారం ఆలస్యంగా పార్లమెంటుకు బిల్లును సమర్పించారు. రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం 20 రోజులకు చేరుకుంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే రష్యా పై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా సైతం వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకుంటూ... తనపై ఆంక్షలు విధించిన దేశాలపై రష్యాలో కార్యకలాపాలు నిర్వహణపై ఆంక్షలు విధిస్తోంది. అంతేకాదు, తన వాణిజ్యాన్ని ఎప్పట్లాగే కొనసాగించడానికి మిత్ర దేశాల సహకారం తీసుకునే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది.
