ఇజ్రాయిల్ పై మిస్సైల్ దాడి.. కేరళ యవకుడు దుర్మరణం..
ఇజ్రాయిల్ పై దాడిని క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు భారతీయులకు గాయాలు అయ్యాయి. వీరంతా కేరళకు చెందిన వారు. భారతీయుడు మరణం పట్ల ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది.
ఇజ్రాయిల్ లో జరిగిన మిస్సైల్ దాడిలో భారతీయ యువకుడు తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. లెబనాన్ నుంచి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణి ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు కమ్యూనిటీ మార్గలియోట్ సమీపంలోని తోటపై పడిందని, దీంతో ఓ భారతీయుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపింది.
క్షిపణి దాడిలో బాధితులైన ఈ ముగ్గురు భారతీయులు కేరళకు చెందినవారు. మృతుడిని కేరళలోని కొల్లాంకు చెందిన పాట్ నిబిన్ మాక్స్ వెల్ (31)గా గుర్తించారు. రెండు నెలల క్రితం ఆయన ఇజ్రాయెల్ వెళ్లారు. క్షిపణి దాడి జరిగిన సమయంలో ఆయన పొలంలోనే ఉండటంతో తీవ్ర గాయాలపై మరణించారు.
మృతుడికి ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. భార్య గర్భవతి. త్వరలోనే ఆమె మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరం. కాగా.. గాయపడిన ఇద్దరు భారతీయులను బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్ గా గుర్తించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఇజ్రాయెల్ ఉత్తరాన గలిలీ ప్రాంతంలోని మోషావ్ (సామూహిక వ్యవసాయ సంఘం) మార్గలియోట్ లోని తోటను క్షిపణి తాకిందని, రెస్క్యూ సర్వీసెస్ మాగెన్ డేవిడ్ అడోమ్ (ఎండీఏ) ప్రతినిధి జాకీ హెల్లర్ ‘పీటీఐ’తో తెలిపారు.
ఈ క్షిపణి దాడిలో జార్జ్ ముఖానికి, శరీరంపై గాయాలయ్యాయి. ఆయనను పెటా టిక్వాలోని బెలిన్సన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆపరేషన్ పూర్తయ్యి, కోలుకుంటున్నారు. భారత్ లో ఉన్న కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన మెల్విన్ ను ఉత్తర ఇజ్రాయెల్ నగరం సఫేద్ లోని జివ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇతను కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందినవాడు.
కాగా.. గాజా స్ట్రిప్ లో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో హమాస్ కు మద్దతుగా అక్టోబర్ 8 నుంచి ఉత్తర ఇజ్రాయెల్ పై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్న లెబనాన్ లోని షియా హిజ్బుల్లా వర్గం ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. భారత పౌరుడి మృతి పట్ల భారత్ లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. దాడిలో గాయపడిన వారికి ఇజ్రాయెల్ వైద్య సంస్థలు సేవలందిస్తున్నాయని తెలిపింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, వారికి సాయం అందిస్తామని రాయబార కార్యాలయం పేర్కొంది.