భవనాల శిధిలాల కింద చిక్కుకున్న ఓ 17యేళ్ల యువకుడు.. బతకడంకోసం తన మూత్రాన్ని తాగి ప్రాణాలు నిలుపుకున్నాడు. 101 గంటల తరువాత మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.
టర్కీ : తీవ్ర భూకంపం టర్కీ, సిరియాలను శిథిలాల కుప్పగా మార్చేసింది. ఎటు చూసినా శిధిలాలు, మృతదేహాలు, క్షతగాత్రులు.. నిరాశ్రయులతో భయంకరంగా కనిపిస్తుంది. ఘటన జరిగి వంద గంటలు దాటిపోయిన ఇంకా శిధిలాల కింద చిక్కుకున్న వారు మిగిలే ఉన్నారు. శుక్రవారం నాడు ఒక రోజే శిధిలాల కింది నుంచి 100 మందిని రక్షించారు. ఈ క్రమంలో ఓ యువకుడు 101 గంటల పాటు శిధిలాల కింద చిక్కుకుపోయి.. ప్రాణం నిలబెట్టుకోవడానికి మూత్రం తాగి బతికాడు. హృదయ విదారకమైన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
ఆద్నాన్ మహమ్మద్ కోర్కుట్ అనే 17యేళ్ల యువకుడు శిధిలాల కింద చిక్కుకుపోయాడు. ఎటు కదలడానికి లేని పరిస్థితి…మరోవైపు చలిగాలులు.. ఇంకోవైపు దాహం ప్రాణం తీసేలా ఉంది. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి తన మూత్రాన్ని తానే తాగాడు. శుక్రవారం నాడు ఎట్టకేలకు 101 గంటల తర్వాత మృత్యుంజయుడుగా బయటికి వచ్చాడు. తుర్కీయేలోని గాజియాంతెప్ లో శుక్రవారం ఒక్కరోజే ఇలాంటి వారు ఎందరో మృత్యుంజయులుగా బయటికి వచ్చారు.
ప్రాణాలతో ఉండేందుకు నాలుగు రోజుల పాటు వారు పడిన ఆరాటం, చేసిన పోరాటం అక్కడివారి హృదయాల్ని ద్రవించేలా చేశాయి. గాజియాంతెప్ భూకంప కేంద్రానికి దగ్గరగా ఉంది. దీంతో నష్టం తీవ్రంగానే ఉంది. రక్షించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కూడా ఉన్నారు. నాలుగు రోజులపాటు మూత్రం తాగి బతకడం వెనక ఉన్న తన జీవకాంక్ష గురించి కోర్కూట్ ఇలా చెప్పాడు.. తన కోసం ఎదురుచూస్తున్న తల్లి కోసం, కుటుంబీకుల కోసం తాను బతికానని చెప్పుకొచ్చాడు.
ఇక అదియామామ్ అనే మరో చోట నాలుగేళ్ల చిన్నారి 105 గంటల పాటు శిధిలాల కింద చిక్కుకుని మృత్యుంజయురాలిగా బయటపడింది. ఆ చిన్నారిని ఆమె తల్లి దగ్గరికి చేర్చడానికి అధికారులు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇస్కెందెరన్ ప్రాంతంలో మల్టీస్టోరర్ బిల్డింగ్ కూలిపోయింది. అందులో 9 మంది శిధిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో ఆరుగురుని రక్షించారు. అయితే ఇలా తిండి, నీరు లేకుండా ఎక్కువలో ఎక్కువ వారం రోజుల పాటు బతికే అవకాశాలు ఉంటాయని.. సమయం గడుస్తున్న కొద్ది బతికే అవకాశాలు సన్నగిల్లుతాయని నిపుణులు చెబుతున్నారు.
దీంతో వీలైనంతమందిని ప్రాణాలతో కాపాడడానికి సహాయక బృందాలు నిరంతరాయంగా, అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. భవన నిర్మాణాలు నాసిరకంగా చేపట్టడం కూడా ఇంత పెను విషాదానికి కారణమని చెబుతున్నారు. భూకంపం కంటే ఇలాంటి నాసిరకం భవనాల నిర్మాణమే ఎక్కువ ప్రాణనష్టాన్ని కలిగించిందని ఆవేదన చెందుతున్నారు.
మరో ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థికి వాట్స్అప్ సిగ్నల్ దొరికింది. వెంటనే తన స్నేహితులకు వాట్స్అప్లో వీడియో మెసేజ్ చేశాడు. తను భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా.. తను ఉన్న ప్రాంతం చెబుతూ ఆ వీడియోను పంపించాడు. అది చూసిన స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది తూర్పు టర్కీలో వెలుగు చూసింది.
