వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ నకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించాలనే ఆయన ఆశలు గల్లంతయ్యాయి. జో బైడెన్ చేతిలో ఆయన ఓటమి పాలు కాక తప్పలేదు. తాను వైట్ హౌస్ ను వీడేది లేదని ట్రంప్ మొరాస్తున్నారు. అయితే, వైట్ హౌన్ నుంచి ఆయన బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని వీడిన మరుక్షణం ఆయనకు మరో షాక్ తగలనుంది. ఆయన శ్వేత సౌధం నుంచి బయటకు వచ్చిన మరుక్షణం మెలానియా ట్రంప్ నకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ ది డైలీ మెయిల్ యూకే ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. మెలానియా మాజీ సహాయకుల మాటలను ఉటంకిస్తూ ఆ వార్తాకథనం ప్రచురితమైంది. 

వారిది ఒప్పంద వివాహమని, కలిసి ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు గానీ మంచాలు మాత్రమే విడివిడిగానే ఉన్నాయని వారు చెప్పినట్లు ఆ వార్తాకథనం తెలిపింది. ట్రంప్ నకు విడాకులు ఇచ్చేందుకు మెలానియా క్షణాలు లెక్కిస్తోందని స్టెఫానీ ఓమరోసా మెనిగాట్ అన్నారు. 

రెండో భార్య మార్లతోనూ ట్రంప్ ది ఒప్పంద వివాహమేనని, దాని ప్రకారం ఆమె దాని గురించి ఏ విధమైన వ్యతిరేక విషయాలు కూడా వెల్లడించకూడదని ఆ పత్రిక రాసింది. మెలానియాతో కూడా ఏదో ఒప్పందం ఉండే ఉంటుందని, అందుకే ఈ పరిస్థితుల్లో కూడా మెలానియా బయటకు ఏమీ మాటాడడం లేదని ఆ పత్రిక సందేహం వ్యక్తం చేసింది. 

మెలానియాతో ఒప్పంద వివాహం మాత్రమే అనడానికి కొన్ని సంఘటనలను పత్రిక ఉదహరించింది. భారత పర్యటన సందర్భంగా మెలానియా చేయి పట్టుకోవడానికి ట్రంప్ ప్రయత్నించగా ఆమె కాస్తా విసురుగా వ్యవహరించడం గుర్తుందని అంటున్నారు.