బాడీ మాడిఫికేషన్.. ఈ పదం వినే ఉంటారు. అయితే.. మన దేశంలో కాస్త తక్కువేగానీ.. విదేశాల్లో మాత్రం దీనిని బాగానే అలవరుచుకున్నారు. అంటే.. శరీంలో కొన్ని మార్పులు చేయించుకొని అందంగా తయారౌతుంటారు. అందంగా కనిపించేందుకు.. శరీరంలో మార్పులు చేసుకోవడాన్నే బాడీ మాడిఫికేషన్ అంటారు. అయితే.. ఓ వ్యక్తి దీనికి పూర్తిగా బానిసగా మారిపోయాడు. ఏకంగా చెవులు కూడా కత్తిరించుకున్నాడు. ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జర్మనీకి  చెందిన శాండ్రో.. బాడీ మాడిఫికేషన్ కి పూర్తిగా బానిసగా మారిపోయాడు. గత పదమూడేళ్లలో అతడు శస్త్రచికిత్సల ద్వారా తన శరీరంలో 17 సార్లు మార్పులు చేసుకున్నాడు. ఆపరేషన్ల కారణంగా శాండ్రో ముఖం తీరే పూర్తిగా మారిపోవడంతో.. అతడికి మిస్టర్ స్కల్ ఫేస్ అనే పేరు పడింది. శస్త్రకిత్సలపై అతడు ఇప్పటి వరకూ దాదాపు 5.8 లక్షలను ఖర్చు చేశాడు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సందర్భంగా అతడు తన రెండు చెవులనూ కోయించేసుకున్నాడు. ప్రస్తుతం వాటిని ఓ డబ్బాలో పెట్టి తన ఇంట్లోనే నిల్వ చేసుకున్నాడు. 

అంతేకాదు.. నుదుటిపై కొమ్ములు మొలుస్తున్నట్టు కనిపించే రెండు ఇంప్లాంట్స్‌ను కూడా అమర్చుకున్నాడు. ఎందుకండీ ఇలా చేస్తున్నారు అని స్థానిక మీడియా ప్రశ్నిస్తే.. నా కిష్టమైంది అందుకే చేస్తున్నాను అని తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు శాండ్రో. తన రూపరేఖలతో కాక తాను అనుసరిస్తున్న విలువల ద్వారా మాత్రమే ప్రజలు తనను గుర్తించాలని కోరాడు. 

అందరి ముందూ కూల్‌గా కనిపించాలనే ఉద్దేశ్యం తనకే మాత్రం లేదని, కానీ.. ఈ మార్పుల ద్వారా తనలో ఆత్మవిస్వాసం ఇనుమడించిదని చెప్పుకొచ్చాడు. అయితే... అతని లుక్ పూర్తిగా మారిపోవడంతో అతనికి ఎవరూ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. అయినా.. తనకు ఎలాంటి బాధలేదని. తన లుక్స్ తో సంబంధం లేకుండా ఉద్యోగం ఇస్తేనే చేస్తానని చెబుతున్నాడు.