చిన్నారులను లైంగిక చర్యలకు ఉసిగొల్పుతున్న ఓ పర్వర్ట్ కు అమెరికా కోర్టు 600 సంవత్సరా జైలు శిక్ష వేస్తూ సంచలన తీర్పు నిచ్చింది. వివరాల్లోకి వెడితే అమెరికాలోని కాటన్ డేల్ కు చెందిన 32యేళ్ల మ్యాథ్యూ టైలర్ మిల్లర్ అనే వ్యక్తి చిన్నారులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించి వాటిని చిత్రీకరిస్తున్నాడు. ఇతనిపై అనేక ఆరోపణలు రాగా 2019లో మ్యాథ్యూ తన నేరాన్ని అంగీకరించాడు. 

2014 నుంచి 2019 మధ్య కాలంలో మిల్లర్ ఈ పాడుపని చేశాడు. నిందితునికి 600 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం అమెరికా డిస్ట్రిక్ జడ్జి స్కాట్ కూగ్లర్ తీర్పు చెప్పారు. నిందితునిపై పలు లైంగిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. 

నిందితుని ఈ వికృత చర్యల వల్ల ఆ చిన్నారులు తమ బాల్యాన్ని దారుణంగా కోల్పోయారని ఎఫ్ బీఐ ప్రత్యేక ప్రతినిధి జానీ షార్ప్ జూనియర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత చిన్నారుల్లో ఇద్దరు నాలుగేళ్ల వయసువారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. 

నిందితుడి గదిని శోధించినప్పుడు చిన్నపిల్లలకు చెందిన 102 అశ్లీల చిత్రాలు దొరికాయన్నారు. 2019 అక్టోబర్ లో మిల్లర్ తన నేరాన్ని అంగీకరించాడు. పన్నెండేళ్లలోపు వయసున్న చిన్నారితో స్వయంగా లైంగిక చర్యలో పాల్గొన్న అభియోం కూడా నిందితునిపై ఉంది.