దిగుమతులు తగ్గించుకోవడంతో పాటు దేశీయంగా వున్న పరిశ్రమలకు చేయూతను అందించడంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ మేకిన్ ఇండియాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు, మూడేళ్లుగా ఈ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. అయితే మేకిన్ ఇండియా కార్యక్రమంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది.

ఆ నిబంధనల వల్ల అమెరికా ఎగుమతులు తగ్గిపోతున్నాయని, దాని వల్ల అమెరికా– భారత్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయని వ్యాఖ్యానించింది. మేకిన్ ఇండియా నినాదంతో దిగుమతులను భారత్ తగ్గించేసిందని అమెరికా కాంగ్రెస్‌కు జో బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మేరకు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్).. 2021 వాణిజ్య విధాన ఎజెండాతో పాటు 2020 వార్షిక నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. అమెరికా ఎగుమతిదారులకు మేకిన్ ఇండియా వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యల గురించి భారత్‌కు వివరించామని, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొంది.

ఇండియా చాలా పెద్ద మార్కెట్. ఆ దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధిలో పురోగతి నేపథ్యంలో చాలా మంది అమెరికా ఎగుమతి దారులు భారత్‌ను మంచి మార్కెట్‌గా భావిస్తున్నారు. అయితే, వాణిజ్యాన్ని నిరోధించే భారత్ చర్యల వల్ల వారికి నష్టం కలుగుతోందన్నారు.

ఇరు దేశాల వాణిజ్య విధానాలు, బంధానికి అడ్డంకిగా మారిన సమస్యల్లో ‘మేకిన్ ఇండియా’ ఒకటి అని అమెరికా పేర్కొంది. మేధో హక్కులు సహా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే చర్యలపై గత ఏడాది మొత్తం భారత్ తో చర్చలు జరిపామని యూఎస్టీఆర్ వెల్లడించింది.

ఎలక్ట్రానిక్, డిజిటల్ వాణిజ్యం, వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులు, సేవల మార్కెట్ కు అడ్డుగా మారుతున్న విధాన నిర్ణయాలు, తదితర అంశాలపై భారత్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది.

దీని ఫలితంగానే గతేడాది జులైలో అమెరికా నుంచి లాక్టోజ్, వెయ్ ప్రొటీన్ కాన్ సంట్రేట్ ల దిగుమతికి భారత్ అంగీకరించిందని యూఎస్టీఆర్ వెల్లడించింది. ఉత్పత్తులతో పాటు డెయిరీ సర్టిఫికెట్‌నూ తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంటూ 2020 ఏప్రిల్ నుంచి వాటిని భారత్ బ్లాక్ చేసిందని గుర్తు చేసింది.