ఆ ప్రేమ జంట ఓ చర్చ్ లో పెళ్లి చేసుకోవాలని భావించింది. దానికి అనుగుణంగా అన్నీ ప్లాన్ చేసుకుంది. కానీ వారి వివాహం చర్చ్ లో జరగాలని రాసి పెట్టిలేదేమో ? పెళ్లి సమయానికి ఆ జంట చర్చ్ కు చేరుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. కనెక్టింగ్ ఫ్లైట్ లు లేకపోవడంతో మధ్యలోనే ఇరుక్కుపోయారు. దీంతో కెప్టెన్, ప్రయాణికులు కలిసి ఆ జంట పెళ్లిని అనుకున్న సమయానికే 37 వేల అడుగుల ఎత్తులో చేశారు.
మీ పెళ్లి ఎక్కడ జరిగింది అంటే ఏం చెబుతాం..? కల్యాణ మండపంలోనే, ఆలయ ఆవరణలోనో లేకపోతే ఇంటి సమీపంలోనే అని సమాధానం ఇస్తాం కదా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పెళ్లిల్లు జరుగుతాయి. కానీ ఈ జంటను మాత్రం ఈ ప్రశ్న అడిగితే ఆకాశంలో అని సమాధానం చెబుతుంది. అదేంటి ? ఆకాశంలో పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా ? అవును. నిజమే. ఆ జంట ఆకాశమార్గంలో 37 వేల అడుగుల ఎత్తులో వివాహం చేసుకుంది. ఈ మధ్య విమానంలో పెళ్లిల్లు జరగడం అక్కడక్కడా వింటూనే ఉన్నాం. కానీ ఈ జంటకు మాత్రం అనుకోకుండా ఇలా ఆకాశ మార్గంలో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఈ పెళ్లి స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉండటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటీ ఇందులో ప్రత్యేకత అనుకుంటారా..? అయితే వెంటనే ఇది చదివేయండి.
జెరెమీ సల్దా, పామ్ ప్యాటర్సన్ ఇద్దరూ ప్రేమికులు. వీరిద్దరు ఏప్రిల్ 24వ తేదీన లాస్ వేగాస్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం అక్కడ చర్చ్ ను కూడా బుక్ చేసుకున్నారు. అయితే ఈ జంట పెళ్లి కోసం ఓక్ల హోమా సిటీ (OKC) నుంచి డల్లాస్-ఫోర్ట్ వర్త్ (DFW) అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడి నుంచి లాస్ వేగాస్ కు వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ రద్దు అయ్యింది. వీరి పెళ్లి రాత్రి 9 గంటలకు ఉన్నప్పటికీ.. కనెక్టింగ్ ఫ్లైట్ లేకపోవడంతో టైం అక్కడే అయిపోతోంది.
ఈ జంట పెళ్లి సమయానికి అక్కడికి ఎలా చేరుకోవాలనే విషయాన్ని చర్చించుకుంటున్నప్పుడు DFW నుండి LASకి వెళ్లే ప్రయాణికుడు క్రిస్ కిల్‌గోరా వీరి సంభాషణ వింటాడు. ఈ జంటకు క్రిస్ సహాయం చేయాలని భావిస్తాడు. వారు ముగ్గురు కలిసి ఆన్ లైన్ లో ట్రై చేసి ఎట్టకేలకు వెగాస్‌కి వెళ్లే సౌత్‌వెస్ట్ ఫ్లైట్‌లో చివరి మూడు సీట్లను ఎలాగోలా బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో జెరెమీ సల్దా, పామ్ ప్యాటర్సన్ వివాహ దుస్తులు వేసుకొని విమానం ఎక్కడం కెప్టెన్ గమనిస్తాడు. దీంతో పామ్ వారి కథను కెప్టెన్ కు చెబుతుంది. ఈ సమయంలో పక్కనే ఉన్న క్రిస్ కిల్ గోరా కెప్టెన్ తో ‘‘విమానంలో పెళ్లి చేద్దామా’’ అని సరదాగా చెబుతాడు. దీంతో కెప్టెన్ స్పందించి ‘‘తప్పకుండా చేద్దాం’’ అని చెబుతాడు. కెప్టెన్ మాటలు విన్న ఆ జంట షాక్ అవుతుంది. కెప్టెన్ ఇలా సానుకూలంగా స్పందిస్తారని వారు అస్సలు ఊహించలేదు.
కెప్టెన్ వీరి వివాహానికి అనుమతి ఇవ్వడంతో అక్కడి పరిస్థితులు వెంటనే మారిపోయాయి. విమానంలో వివాహ వాతావరణాన్ని సృష్టించేందుకు, విమానం లోపల ప్రతీ చోటా టాయిలెట్ పేపర్‌తో చేసిన స్ట్రీమర్‌లను అలంకరించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడానికి ముందుకొచ్చాడు. కాగా దంపతుల కోరికలతో సంతకం చేసేందుకు మరో వ్యక్తి పాత నోట్‌బుక్‌ను అందించాడు. మూడ్ లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాక్ గ్రౌండ్‌లో ‘హియర్ కమ్స్ ది బ్రైడ్’ ప్లే చేయడంతో పెళ్లికొడుకు జెరెమీ సల్దా విమానం మధ్యలో నడవ సాగాడు. ఫ్లైట్ అటెండెంట్ జూలీ వధువు గౌరవ పరిచారికగా మారిపోయింది.
ప్రపంచంలోని మ్యారేజ్ క్యాపిటల్‌గా పిలువబడే వేగాస్‌కు బదులుగా గాలిలో 37,000 అడుగుల ఎత్తులో ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఏప్రిల్ 29వ తేదీన జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. లెక్కలేనన్ని కామెంట్స్ వస్తున్నాయి. ‘‘ సౌత్ వెస్ట్ దాదాపు 51 సంవత్సరాలుగా ‘ప్రేమ’ ఎయిర్‌లైన్‌గా ఉంది. మా కస్టమర్‌లకు ప్రత్యేక మార్గాల్లో సంబరాలు జరుపుకునే విషయంలో మేము ఎప్పుడూ ఆనందంగా ఉంటాం ’’ అని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
