ప్రస్తుత కాలంలో ప్రేమ పేరుతో ఒకరిని మరోకొరు మోసం చేసుకునేవారు... వారి అవసరాల కోసం ప్రేమను సృష్టించే వారు చాలా మంది ఉన్నారు. ఇంకొందరు... ప్రేమించామని మాటలు చెప్పి... వారి అవసరాలు తీరిన తర్వాత పెళ్లి పేరు ఎత్తగానే పరారైపోతున్నారు. ఇంకొందరు.. ప్రేమను పెళ్లిగా మార్చుకున్న తర్వాత కూడా... ఎక్కువ సంత్సరాలు కలిసి ఉండలేకపోతున్నారు. కారణం ఏదైనా ఈ మధ్యకాలంలో ప్రేమ అంటే ఎవరికీ నమ్మకం ఉండటంలేదు. ఇలాంటి కాలంలో కూడా స్వచ్ఛమైన ప్రేమికులు ఉన్నారని తెలియజేసే కథ ఇది.

సాధారణంగా ప్రేమించుకున్న జంట పెళ్లి అనే బంధం ఒక్కటి చేస్తుంది. కేవలం మరణం మాత్రమే మమ్మల్ని విడదీస్తుంది అని చాలా మంది జంటలు చెబుతుండగా వినే ఉంటారు. అయితే ఓ యువకుడు మాత్రం మరణం వచ్చినా... మా బంధాన్ని విడదీయలేరని నిరూపించాడు. చనిపోయిన ప్రియురాలిని పెళ్లి చేసుకొని తన ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... జూ షినాన్, యాంగ్ లియూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకునేందుకు 2013లో కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది. అయితే మూడు నెలల తరువాత యంగ్‌కు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వెల్లడైంది. నాలుగేళ్ల పాటు యంగ్‌కు శస్త్ర చికిత్సతో పాటు కీమోథెరపీ కూడా కొనసాగడంతో ఆరోగ్యవంతురాలయ్యింది. 

అయితే ఏడాది తరువాత ఆమెకు తిరిగి క్యాన్సర్ సోకింది. దీంతో ఆమె మళ్లీ చికిత్స తీసుకోవడం ప్రారంభించింది. ఈ నేపధ్యంలో 2019 అక్టోబర్ 6న ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఆమె మృతి చెందింది. కాగా యాంగ్ ఆసుపత్రితో చేరేముందు ఒక పెళ్లి గౌనును ఇష్టపడిందని జూ తెలుసుకున్నాడు. 

అందుకే ఆమె కోసం ఆ అందమైన గౌనును కొనుగోలు చేశాడు. దానిని యాంగ్ మృతదేహానికి ధరింపజేసి, ఆమెను వివాహం చేసుకుని ప్రియురాలి చివరి కోర్కెను తీర్చాడు. కాగా.. వీరి పెళ్లి వార్త స్థానికంగా వైరల్ అయ్యింది. అతని ప్రేమను ప్రతి ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తడం విశేషం.