విశ్వం అనంతం. అనేక రహస్యాలను చీకట్లో దాచి పెట్టుకుంది. ఇప్పుడు ఆ రోదసి నుంచి భూమిపై వచ్చిపడిన ఉల్కలే జీవి ఏర్పాటుకు దోహదపడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనమంతా అంతరిక్షంలో భాగమేనని, మరో రకంగా చెప్పాలంటే.. మనమంతా నక్షత్ర దూళితోనే ఏర్పడినవారం అనే వాదన చేస్తున్నారు. 

న్యూఢిల్లీ: మనం నక్షత్రధూళితో తయారయ్యాం.. మనకు అంతుపట్టని రోదసి లోతులకు చిక్కటి సంబంధం ఉన్నది.. ఇదీ కార్ల్ సాగన్ మొదలు మొన్నటి రోహిత్ వేముల వరకు బయటకు చెప్పారు. సైన్సు స్టూడెంట్లు ఎంతో కొంత ఈ వాదనను అంగీకరిస్తారు. అయితే, ఈ వాదనలను బలపరిచేలా సైంటిస్టులు కొన్ని ఆధారాలు కనిపెట్టారు. ఈ పరిశోధనలే భూమిపై జీవం ఎలా ఉద్భవించింది? అనే ప్రశ్నకు సమాధానాలు అవుతున్నాయి. ఒక్కో మతం ఒక్కోలా చెప్పినా.. సైన్స్ మాటేమిటీ? అనేదే అంతిమంగా చర్చకు నిలబడేది. కాబట్టి, శాస్త్రవేత్తలు కొత్తగా ఏం పరిశోధించారు? వారి వాదనలెమిటి? ఓ సారి చూద్దాం.

రోదసి నుంచి దూసుకువచ్చిన ఉల్కలే భూమిపై ప్రాణాన్ని పొశాయని, మన డీఎన్ఏకు అంతరిక్షానికి గాఢమైన సంబంధం ఉన్నదని మౌలికంగా ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే జీవికి కావాల్సిన కెమికల్ పదార్థాలను ఈ ఉల్కలే తెచ్చాయని పేర్కొంటున్నారు. హొక్కాయిడో యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లో టెంపరేచర్ సైన్స్ (ఐఎల్‌టీఎస్)లో పని చేస్తున్న ఓ శాస్త్రబృందం సంచలన విషయాలు వెల్లడిస్తున్నది.

జర్నల్ నేచర్ కమ్యూనికేషన్‌లో ఈ శాస్త్రబృందం ఈ అధ్యయనాలకు సంబంధించి ఓ నివేదికను పబ్లిష్ చేశారు. ఈ అధ్యనాయనాల్లో భూమిపై రాలిపడ్డ సుదూరాలకు చెందిన ఉల్కలను పరీక్షించారు. డీఎన్ఏ ఏర్పాటుకు మౌలికంగా అవసరమైన పదార్థాలను మూడు ఉల్కల కర్బన సంబంధ న్యూక్లియోబేస్‌లలో కనిపెట్టారు.

సైటోసైన్, యూరాసిల్, థైమిన్, వాటి స్ట్రక్చర్ల ఐసొమర్లు అయినా ఐసోసైటోసైన్, ఇమిడజోల్-4-కార్బాక్సిలిక్ యాసిడ్, 6-మిథైల్ యురాసిల్‌లను సైంటిస్టులు గుర్తించారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డీఎన్ఏ.. అడెనైన్(ఏ), థైమిన్ (టీ), సైటోసైన్ (సీ), గ్వానైన్ (జీ)లతో నిర్మితం అయిందని గుర్తుంచుకోవాలి. కాగా, ఆర్ఎన్ఏ ఏ, సీ, జీలతోపాటు యురాసిల్‌కు బదులు థైమిన్‌తో నిర్మితమై ఉంటుందని తెలిసిందే.

1950లో యూఎస్ కెంటకీలోని ముర్రే టౌన్‌లో పడ్డ ఒక ఉల్క, 1969లో ఆస్ట్రేలియాలో విక్టోరియా స్టేట్ ముర్చిసన్ పట్టణంలో పడ్డ మరో ఉల్క, 2000లో కెనడాకు చెందిన తాగిష్ లేక్ సమీపంలో పడ్డ ఇంకో ఉల్కను పరిశోధకులు పరిశీలించారు. ఈ మూడు ఉల్కలను కర్బన సంబంధ కోండ్రైట్లుగా గుర్తించారు. శిల పదార్థాలతో ఇవి ఏర్పడి ఉండొచ్చని, సౌర వ్యవస్థ చరిత్రకు ముందే ఇవి రూపొంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మూడు మెటీరియోరైట్‌లలో కర్బనం ప్రాథమికంగా కనిపిస్తున్నది. భూమిపై ఉన్న ప్రతి జీవిలో కర్బనం అతికీలకమైన కెమికల్ అని తెలిసిందే.

భూమిపై జీవి ఎలా ఏర్పడి ఉండొచ్చనే ప్రశ్నకు సమాధానాలను ఇప్పటికీ శాస్త్రజ్ఞులు పరిశోధిస్తూనే ఉన్నారు. ఇలాంటి రసాయనాలు ఉల్కల రూపంలో భూమిని చేరి ఉంటే.. అవి ఎలాంటి పరిస్థితుల్లో జీవిగా పరిణమించాయనే సందేహాలకు సమాధానాలు ఇంకా దొరకలేవు. భూమిపై జీవి పుట్టకముందు వేడిమి నీటితో నిండి ఉంది. అప్పుడు జీవి ఎలా ఏర్పడింది? అది దాని పునరుత్పత్తి సామర్థ్యాన్ని ఎలా సాధించుకోగలిగింది? అనే ప్రశ్నలు ఇంకా తొలుస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన కెమికల్ స్టెప్స్‌పై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు ఉల్కల్లో కొత్తగా ఆవిష్కరించిన సైటోసైన్, థైమిన్ వాటి సున్నితమైన నిర్మాణాల కారణంగా గతంలో పరిశోధనలకు చిక్కి ఉండకపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఈ ఐదు కెమికల్స్ మాత్రమే జీవి ఏర్పడటానికి సరిపడకపోవచ్చని, అమైనో యాసిడ్స్, డీఎన్ఏ, ఆర్ఎన్ఏల బ్యాక్‌బోన్‌గా ఉండే షుగర్స్, ఫ్యాటీ యాసిడ్స్ కూడా అవసరం పడతాయని పేర్కొంటున్నారు. అయితే, భిన్నమైన ఉల్కలు భూమిపై పడి.. అప్పటి అసాధారణ పరిస్థితుల్లో జీవి పుట్టుకకు పునాది వేసి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.