భారత్ ను తరచూ పొగుడుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యమ్ నవాజ్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ అంతగా నచ్చితే  పాకిస్తాన్ ను విడిచి, ఆ దేశానికి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ ను కోరారు. 

న్యూఢిల్లీ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యమ్ నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ భార‌త్ కు వెళ్లిపోవాల‌ని సూచించారు. ఇటీవ‌ల కాలంలో పాక్ ప్ర‌ధాని మ‌న దేశంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నేప‌థ్యంలో మ‌ర్య‌మ్ న‌వాజ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

ప్ర‌స్తుతం పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎమ్‌ఎల్-ఎన్) కు మ‌ర్య‌మ్ న‌వాజ్ వైస్ ప్రెసిడెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు భార‌త దేశం అంత‌గా నచ్చితే ఆయ‌న అక్క‌డికే వెళ్లిపోవాల‌ని అన్నారు. ‘‘ ఈ అధికారం పోయిందని చూసి వెర్రితలలు వేస్తున్న వ్యక్తికి ఎవరైనా చెప్పాలి. ఆయ‌న‌ను సొంత పార్టీయే తరిమికొట్టిందని, మరెవరో కాద‌ని తెలపాలి. మీకు భారత్ అంటే అంత ఇష్టమైతే అక్కడికి వెళ్లిపోండి. పాకిస్థాన్‌ను వదిలివేయండి ’’ అని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ భారత ప్రజలను ‘‘ఖుద్దర్ క్వామ్’’
(చాలా ఆత్మగౌరవ ప్రజలు) గా అభివర్ణించిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా మాట్లాడారు. 

ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌సంగించారు. భార‌తదేశ ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వం క‌లిగిన వార‌ని, వారి నుంచి పాకిస్తాన్ ఎంతో నేర్చుకోవాల‌ని అన్నారు. ఏ అగ్ర‌రాజ్యం భార‌త్ పై ఆంక్ష‌లు విధించ‌ద‌ని అన్నారు. అయితే న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ లు మంచి సంబంధాల‌ను ఏర్ప‌ర్చుకోలేద‌ని అంగీక‌రించారు. 

ఈ ప్ర‌సంగంలో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్తావించారు. భారతదేశం, పాకిస్తాన్ రెండూ కూడా క‌లిసి ఒకే సారి స్వాతంత్రం పొందాయ‌ని చెప్పారు. అయితే భార‌త్ సార్వభౌమాధికారంతో నిల‌బ‌డి ఉంటే, పాకిస్తాన్ మాత్రం విదేశాల‌కు ఒక టిష్యూ పేపర్‌గా ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని అన్నారు. 

ఇదిలా ఉండ‌గా ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు తప్పుప‌ట్టింది. ఆ నిర్ణ‌యం రాజ్యాంగ విరుద్ద‌మ‌ని చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జ‌ర‌గాల్సిందేని చెప్పింది. అయితే ఈ తీర్పుపై కూడా ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కాగా ఈ అవిశ్వాత తీర్మానంపై ఉద‌యం ప‌ది గంట‌ల‌కు ఓటింగ్ ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.