కరోనా మహమ్మారి భారత్ ని అతలాకుతలం చేసేస్తోంది. ఊహించని విధంగా కేసులు రోజు రోజుకీ పెరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో... భారత్ కి అండగా నిలిచేందుకు అమెరికా ముందుకు వచ్చింది. కరోనా సమయంలో భారత్ కి కావాల్సిన సహకారం అందించేందుకు తాము సహాయం అందిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హామీ ఇచ్చారు.

కరోనా కట్టడిలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను భారత్ కు పంపిస్తామని తెలిపారు. మొదటి దశ  సమయంలో అమెరికా ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న సమయంలో.. భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో ఆపదలో ఉన్న భారత్ కి సహకారం  అందిస్తామని భరోసా ఇచ్చారు.

అదేవిధంగా కొవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేసతూ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేకే సలీవన్ చేసిన ప్రకటనను బైడెన్ తన ట్వీట్ కి జత చేశారు.

మరో వైపు భారత్ లో కోవిడ్-19 విజృంభణ ఆందోళనకరంగా ఉందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఈ నేపథ్యంలో కవాల్సిన సాయం అందించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. సాయం అందిస్తూనే.. హెల్త్ కేర్ వర్కర్లతో పాటు భారత ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు.

భారత్ లో కోవిడ్ రెండో దశ విజృంభణపై ఇరువురు నేతలు స్పందించడం ఇదే తొలిసారి. అంతకముందు భారత్ కి అండగా నిలవకపోవడంపై సొంత పార్టీలోని భారత సంతతికి చెందిన నేతల నుంచి బైడెన్ పాలకవర్గం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
టీకాలతోపాటు.. అత్యవసర వైద్య పరికరాలు పంపించాలని ఒత్తిడి చేశారు.