జపాన్ ప్రధానమంత్రి షింజో అబే రాజీనామా చేయనున్నట్టు ఇందాక కొద్ది సేపటికింద జపాన్ స్థానిక మీడియా సంస్థ ప్రకటించింది. అనారోగ్యం కారణంగా ఆయన రాజీనామా చేయనున్నట్టుగా తెలియవస్తుంది. ఆయన నేడు ఒక సమావేశంలో ప్రసంగించాల్సి ఉండగా... దానికి కొద్దీ గంటల ముందే ఈ విషయం బయటకు వచ్చింది. 

జాతీయ బ్రాడ్ కాస్టర్ ఎన్ హెచ్ కే కథనం ప్రకారం... షింజో ఆరోగ్యం బాగా క్షీణించడంతో, దేశాన్ని నడపడంలో ఇబ్బందులు తలెత్తకూడదన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా వారు ప్రకటించారు. 

ప్రధాని ఆరోగ్యం గురించి కొన్ని వారాలుగా చర్చ నడుస్తున్నప్పటికీ... ఆయన రాజీనామా చేస్తారనేంత వరకు మాత్రం వ్యవహారం వెళ్ళలేదు. ఆయన తాజాగా ఆసుపత్రికి రెండు సార్లు వెళ్లడం ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తూ.... నేడు అది నిజమైంది. 

నేటి సాయంత్రం 5 గంటలకు షింజో అబే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారనే సమాచారం. ఈ మీడియా సమావేశంలో ఆయన తన రాజీనామాను, రాజీనామాకు గల కారణాలను తెలుపుతారని భావిస్తున్నారు. 

ఈ నెలలోజపాన్ ప్రధాని మూడుసార్లు సెలవు తీసుకున్నారు. అంతే కాకుండా 17వ తేదీనాడు ఆసుపత్రికి వెళ్లి అక్కడ దాదాపుగా 7గంటలపాటు అక్కడే గడిపారు. ఆయన కు పలు రకాల పరీక్షలను నిర్వహించినట్టు సమాచారం.