భూకంపంతో జపాన్ అతలాకుతలం.. 30 మంది మృతి, 45 వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా..
Japan Earthquake : జపాన్ లో సంభవించిన భూకంపం ఆ దేశంలో తీవ్ర నష్టాన్ని మిగిలిచ్చింది. ప్రజా రవాణ వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. ఈ ప్రకంపనల వల్ల 45 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 30 మంది మరణించారు.
Earthquake in Japan : కొత్త సంవత్సరం మొదటి రోజునే జపాన్ లో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ప్రకంపనల వల్ల జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. దాదాపు 45 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ భూకంప వల్ల సంభవించిన నష్టంపై ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడా మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని "కాలానికి వ్యతిరేకంగా పోరాటం"గా అభివర్ణించారు.
మంగళవారం కూడా 150కి పైగా భూప్రకంపనలు సంభవించాయని, రాబోయే రోజుల్లో బలమైన ప్రకంపనలు కొనసాగుతాయని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ భూ ప్రకంపనల వల్ల నిగటా, టోయామా, ఫుకుయి, గిఫు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, కార్యాలయాలు, మాల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి.
ఇషికావా ప్రావిన్స్ లో ప్రస్తుతం 45,700 గృహాలకు విద్యుత్ సరఫరా లేదని హోకురికు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ మంగళవారం తెలిపింది. వాజిమా నగరంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో ఆ ప్రాంతంలోని 100 భవనాలు దగ్ధమయ్యాయి. ఈ భూకంపం వల్ల రైలు, విమాన, మెట్రో సర్వీసులను నిలిచిపోయాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.
కాగా.. జపాన్ సముద్రం వెంబడి సునామీ హెచ్చరికలను అధికారులు ఎత్తివేశారు. అయితే భూకంపం వల్ల సంభవించిన నష్టంతో ఆ దేశ ప్రజలు విలవిల్లాడుతున్నారు. అనేక టెక్టోనిక్ ప్లేట్లు కలిసే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో జపాన్ ఉంది. అందుకే ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.
2011 లో జపాన్ ను 9.0 తీవ్రతతో తాకిన భూకంపం సునామీకి దారితీసింది. దీని వల్ల దేశంలోని ఈశాన్య తీర ప్రాంతాలను చీల్చివేతకు గురయ్యాయి. ఈ భూకంపం దాదాపు 18,000 మందిని చంపింది. పదుల సంఖ్యలో ప్రజలను నిర్వాసితులను చేసింది. ఆ సునామీ తరంగాలు ఫుకుషిమా విద్యుత్ కేంద్రంలో అణు విచ్ఛిన్నానికి కారణమయ్యాయి. ఇది చెర్నోబిల్ తరువాత అత్యంత తీవ్రమైన అణు ప్రమాదానికి కారణమైంది.