జైషే మొహమ్మద్ అధినేత, పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి మౌలానా మసూద్ అజార్ మరణించినట్లుగా వస్తున్న వార్తలు వదంతులేనని తేల్చి చెప్పింది పాక్ మీడియా.

రావల్పిండిలోని సైనిక ఆసుపత్రిలో మసూద్ మరణించినట్లు ఆదివారం సాయంత్రం కొన్ని వార్తా సంస్థల్లో కథనాలు రావడంతో భారత్-పాక్‌లతో పాటు అంతర్జాతీయంగా కలకలం రేగింది. దీంతో భారత నిఘా వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి ప్రయత్నించాయి.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి పాక్ మీడియాలో మసూద్ బతికే ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అజార్ బతికే ఉన్నాడని ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నట్లు పాక్ కేంద్రంగా నడిచే జియో న్యూస్ తెలిపింది.

మరోవైపు ఈ కథనాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో మసూద్ రావల్పిండిలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ప్రకటించిన సంగతి తెలిసిందే.