Gaza Strip: జాతి హననమే లక్ష్యమా? ఉత్తరాది నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఇచ్చిన ఆదేశాలు వేటికి సంకేతం?
హమాస్‌ను నాశనం చేయడమే తమ లక్ష్యం అని ఇజ్రాయెల్ సైన్యాన్ని గాజా సరిహద్దులో భారీగా మోహరింపజేసింది. గాజా పట్టిలో గాజా పట్టణం ఉన్న ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు పౌరులు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ 24 గంటల గడువు ఇచ్చింది. ఉత్తరాదిన ఉన్న 11 లక్షల మంది పౌరులు ఈ స్వల్ప అవధిలో దక్షిణాది వైపు వెళ్లడం అసాధ్యం అని, ఇజ్రాయెల్ ఈ గడువు బూచీతో విధ్వంసానికి తెరలేపాలనే ప్రణాళికలో ఉన్నదని, అది జాతి హననానికి పాల్పడాలని చూస్తున్నదని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
యుద్ధం జరిగిన ప్రతిసారీ మానవ మేధస్సు విఫలమైంది అనే మాట చాలా మందిని కలవరపెడుతుంటుంది. ఇజ్రాయెల్ పై హమాస్ సాయుధులు అక్టోబర్ 7న చేసిన మారణహోమం దారుణం. ప్రపంచాన్ని కదలించింది, కలచివేసింది. హమాస్ యుద్ధ నేరాలకు పాల్పడింది. పౌరులను బందీలుగా చేసుకుంది. సహజంగానే ఇజ్రాయెల్ ప్రతీకారదాడికి పూనుకుంది. హమాస్‌ను తుడిచిపెట్టేస్తామని ప్రతినబూనింది. గగనతల దాడులే కాదు.. భూతల దాడికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. సాధారణ పౌరులు ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని 24 గంటల వ్యవధి ఇచ్చింది. గాజా పట్టిలో ఉత్తరం వైపునే గాజా పట్టణం ఉంటుంది.
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారానికి పూనుకున్న సందర్భంలో ప్రపంచ దేశాలు వాటికి మద్దతుగా దాదాపు రెండుగా చీలిపోయాయి. చాలా దేశాలు ఇజ్రాయెల్ వైపు నిలబడ్డాయి. ఇజ్రాయెల్ ప్రజల ఆక్రోశానికి మద్దతు ఇచ్చాయి. హమాస్ ఉగ్రవాద చర్యలను దునుమాడాయి. హమాస్ దారుణాలను పేర్కొంటూ ఇజ్రాయెల్‌ను కొందరు సమర్థిస్తుండగా.. దినదినం గండంగా మారిన పాలస్తీనా ప్రజల దీనావస్థనూ మానవత్వంతో చూసిన వారు మరికొందరున్నారు. పీడనం నుంచి తిరుగుబాటు వచ్చినట్టుగా ప్రతి రోజూ జీవన్మరణ సమస్య అయినప్పుడు హింస చెలరేగుతుందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా యుద్ధ నేరాలకు పాల్పడిందని, పాల్పడుతున్నదని చెబుతున్నారు.
ఇజ్రాయెల్ పై దాడిలో సుమారు 1300 మందిని హమాస్ పొట్టనబెట్టుకోగా.. ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 2,400 మందికి పైగా దుర్మరణం చెందారు.
ఇదిలా ఉండగా.. గాజాపట్టి సరిహద్దులో భారీ మొత్తంలో సైన్యాన్ని మోహరించిన ఇజ్రాయెల్.. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని పాలస్తీనియన్లకు 24 గంటల సమయం ఇవ్వడం చర్చనీయాంశమైంది. పాలస్తీనియన్లు వెళ్లిపోతున్న దారుల్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. అక్కడి జనాభా దక్షిణాది వైపు వెళ్లడానికి అందుబాటులోని సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుంటే ఆ గడువు సరిపోదు. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్ మొత్తంగా జాతి హననానికి పాల్పడాలనే అంతర్లక్ష్యానికి పైకి తొడుగుగానే ఈ తరలింపు ఆదేశాలు ఇచ్చిందనే ఆందోళనలు మానవ హక్కుల కార్యకర్తల నుంచి వస్తున్నాయి.
ఉత్తర గాజాలో 11 లక్షల మంది జీవిస్తున్నారు. ఇజ్రాయెల్ తరలింపు ఆదేశాలు ఇవ్వగానే కొందరు నడుచుకుంటూ, మరికొందరు ట్రక్కులు ఎక్కి, కొందరు అదృష్టవంతులు కారుల్లో సర్దుకుని బయల్దేరారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఉత్తర గాజాలోని వీరు వెళ్లే దారులపైనా బాంబులు పడ్డాయి. దీంతో ఈ తరలింపు ప్రక్రియ మరింత క్లిష్టంగా మారిపోయింది. దక్షిణాదికి తరలిపోతున్న కాన్వాయ్‌లనూ ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుందని కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్ ఆదేశాలకు లోబడి దక్షిణాదివైపు వెళ్లుతున్న వారిపై ఇజ్రాయెల్ నుంచి వచ్చిన బాంబుల్లో అక్టోబర్ 13న 70 మంది మరణించారని పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది.
Also Read: Israel-Hamas War: ఇజ్రాయెల్‌లో అష్కెలాన్‌లోని బాంబ్ షెల్టర్ లోపల ఇలా..
చివరకు చాలా మంది దక్షిణాదివైపు వెళ్లగలిగారు. చాలా మంది వైకల్యం, గాయాల కారణంగానో, హాస్పిటళ్లలో చికిత్స పొందుతూనో, పేషెంట్లకు వైద్యం మానేసి వెళ్లవద్దనే సంకల్పంతోనో ఉత్తరాదిలో ఉండిపోయారు. దీనికితోడు ఉత్తరాదిని వీడాలంటే వారిలో ఒక భయం ఉన్నది. ఇప్పుడు వెళ్లితే మళ్లీ స్వస్థలానికి శాశ్వతంగా తాము తిరిగిరాలేకపోవచ్చనే భయం వారిని వెంటాడుతున్నది. శాశ్వత అజ్ఞాతంలోనే ఉండిపోవాల్సి వస్తుందనే భయాలు ఉన్నాయి. 1948లో ‘నక్బా ’ కాలంలో స్వస్థలం విడిచి వెళ్లిన 7.50 లక్షల మంది పాలస్తీనియన్లు ఇప్పటికీ శాశ్వత విస్థాపితులుగానే ఉన్నారు. వారు తిరిగి తమ స్వస్థలానికి రావడం కాదు.. కనీసం సందర్శించడం అసాధ్యంగానే ఉంటున్నది.
గడువు పెట్టి ఆ తర్వాత విచ్చలవిడి విధ్వంసానికి పాల్పడాలని చూడరాదని ఇది వరకే అంతర్జాతీయ సంస్థలు ఇజ్రాయెల్‌ను హెచ్చరించాయి. అంతర్జాతీయ మానవతా నిబంధనలను పాటించాలని కోరుతున్నాయి. ఇదిలా ఉండగా, 24 గంటల్లో ఉత్తరాది నుంచి దక్షిణాది వైపుగా పౌరులు అందరూ తరలివెళ్లిపోలేరని ఇజ్రాయెల్‌కు కూడా తెలుసు అని విమర్శకులు అంటున్నారు. అయితే, ఈ తరలింపు ఆదేశాల బూచీ ఇజ్రాయెల్ మారణహోమం సృష్టించడానికి ఉపకరిస్తుందనీ చెబుతున్నారు. అంతేకాదు, హమాస్ మానవ కవచాలు వాడుకుంటున్నదని పేర్కొంటూ ఘోరకలికి పాల్పడవచ్చనీ ఆరోపిస్తున్నారు.
త్వరలోనే గాజాపై ఇజ్రాయెల్ భయంకర ఆక్రమణ చేస్తుందనే భయాలు నెలకొంటున్నాయి. హమాస్ నాయకత్వమే తమ లక్ష్యం అని చెప్పినా.. అది మారణహోమానికి ఒక ముందుమాటగానే ఉండిపోవచ్చనే భయాలూ మానవ హక్కుల కార్యకర్తల నుంచి వస్తున్నాయి. ఈ ఆక్రమణ ద్వారా పాలస్తీనియన్లను మరింత సంకుచిత స్థలానికి పరిమితం చేయగలదని, లేదా లక్షలాది మందిని సరిహద్దు వెలుపలకూ పంపించగలదని వారి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ కోణంలో చూసినా ఇది జాతి హననం అని చెప్పవచ్చని ఇజ్రాయెల్ విమర్శకులు చెబుతున్నారు.