Asianet News TeluguAsianet News Telugu

ఇమ్రాన్‌‌ ఖాన్‌కు భారీ ఊరట.. మే 17 వరకు అరెస్ట్ చేయకుండా ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు..

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కొంత ఊరట లభించింది. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Islamabad High Court grants bail to Imran Khan in Al-Qadir Trust case ksm
Author
First Published May 12, 2023, 3:55 PM IST

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు 2 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఈ నెల 17 వరకు ఇమ్రాన్ ఖాన్‌ను అధికారులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించింది. మే 9 తర్వాత దాఖలైన ఏదైనా కొత్త కేసులో బుధవారం (మే 17) వరకు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయకుండా సంబంధిత అధికారులను ఇస్లామాబాద్ హైకోర్టు నిషేధించింది.

ఇక, అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధం అని పాకిస్తాన్ సుప్రీంకోర్టు పేర్కొన్న ఒక రోజు తర్వాత.. ఆయన బెయిల్ పిటిషన్‌పై ఇస్లామాబాద్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఈరోజు ఉదయం  ఇమ్రాన్ ఖాన్ హై-సెక్యూరిటీ కాన్వాయ్‌తో కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు వద్ద వందలాది మంది పోలీసులు, పారామిలటరీ దళాలను మోహరించారు. 

ఇమ్రాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై జ‌స్టిస్ మియాంగుల్ హ‌స‌న్ ఔరంగ‌జేబ్‌, జ‌స్టిస్ సమాన్ రాఫ‌త్ ఇంతియాజ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారణ చేపట్టింది. విచారణ మొదటి సెషన్‌లో.. అక్కడివారు ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వెంటనే ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ కోర్టు గది నుండి నిష్క్రమించారు.

తర్వాత తిరిగి విచారణ జరిగింది. ఈ సందర్బంగా.. కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇలాగే చేశారు. అయితే కోర్టు సిబ్బంది కూడా వారిని నియంత్రించడంలో విఫలమయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్ మాట్లాడుతూ.. ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇక, ఇమ్రాన్ ఖాన్‌కు రెండు వారాల బెయిల్ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

ఇదిలా ఉంటే.. ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) ఆదేశాల మేరకు పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు గదిలోకి చొరబడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దారితీసింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేశారు. వాహనాలు, అంబులెన్స్‌లను తగులబెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో సాధారణ దుకాణాలను దోచుకున్నారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం దాదాపు 3,000 మందిని అరెస్టు చేసింది.

అయితే గురువారం పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. అయితే అరెస్టును సమర్థించాలనే దాని ప్రాథమిక నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఇస్లామాబాద్ హైకోర్టును కోరింది. ఇస్లామాబాద్ కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా గౌరవిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇస్లామాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తే ఇమ్రాన్ ఖాన్‌ను రీ అరెస్టు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇదిలా ఉండగా.. పంజాబ్ ప్రావిన్స్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన అనేక కేసుల్లో ఆయనను అరెస్టు చేసేందుకు లాహోర్ పోలీసుల బృందం ఇస్లామాబాద్‌కు బయలుదేరినట్లు వార్తలు వచ్చాయి. ఇక,  దేశ వ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్‌పై 121 కేసులు ఉన్నాయి. ఇందులో దేశద్రోహం, దైవదూషణ, హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటివి ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్‌పై లాహోర్‌లో 12 ఉగ్రవాద కేసులు, ఫైసలాబాద్‌లో 14 కేసులు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios