కొందరికి పెంపుడు జంతువులంటే మహా సరదా. కుక్కలను, పిల్లలను, పక్షులను ఇలా నచ్చిన వాటిని పెంచుకుంటూ తమ సరదా తీర్చుకుంటూ ఉంటారు. కానీ ఓ మహిళ మొసలిని పెంచి దానికే ఆహారంగా మారిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన 44 ఏళ్ల మహిళా సైంటిస్టు అందరికంటే భిన్నంగా తన ఇంట్లో మొసలిని పెంచుకుంటోంది.

14 అడుగుల పొడవుతో భారీ కాయంతో ఉన్న ఆ క్రూర జీవి...తొలుత బాగానే ఉన్నప్పటికీ తరువాత తన అసలు స్వరూపం చూపించింది. ఓ రోజున యజమానురాలిపై దాడి చేసి క్రూరంగా చంపేసింది. మరుసటి రోజు ఉదయం ఆమె ఇంటికి వచ్చిన తోటి ఉద్యోగులకు దారుణంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన సైంటిస్ట్ మృతదేహం కనిపించింది.

అయితే అప్పటికే మొసలి ఆమె చేతిని పూర్తిగా తినేయడంతో పాటు పొట్టను కూడా చీల్చేసింది. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. అనంతరం డాక్టర్లు, ఆర్మీ, అటవీశాఖ సిబ్బందితో అక్కడికి వచ్చిన అధికారులు ఆ భారీ మొసలిని పట్టుకుని జూకు తరలించారు. మహిళా శాస్త్రవేత్త మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.